1.44లక్షలకు 13వేలే వచ్చాయి
నేరేడుచర్ల : ఉచిత చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సహకార సంఘం సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. 1.44 లక్షల చేప పిల్లలకుగాను 13వేలు మాత్రమే వచ్చాయని పంపిణీ ప్రక్రియను అడ్డుకొని లారీని వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ చిల్లేపల్లి ఊర చెరువులో పోసేందుకు 1.44లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే చేప పిల్లలతో లారీ రాగా అనుమానం వచ్చి డ్రమ్ములను పరిశీలించామన్నారు. ఒక్కో డ్రమ్ములో 1,300 చేప పిల్లల చొప్పున 10 డ్రమ్ముల్లో కలిపి 13వేలు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో ఆ లారీని వెనక్కి పంపించామన్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని తమ చెరువుకు కేటాయించిన చేప పిల్లలన్నింటినీ పంపించాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నల్లమేకల వెంకయ్య, కార్యదర్శి పిట్టల గోవిందు, ఉపాధ్యక్షుడు బయ్య నర్సయ్య, సభ్యులు లచ్చయ్య, నాగరాజు, కృష్ణా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చేపపిల్లల పంపిణీలో అవకతవకలు
ఫ చిల్లేపల్లి సహకార సంఘం
సభ్యుల ఆందోళన బాట
ఫ లెక్కతేల్చి చేపల లారీని
వెనక్కి పంపిన సభ్యులు


