‘తెలామిన్’.. పశుపోషకులకు వరం
కోదాడరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి తెలామిన్ అని నామకరణం చేసి నాణ్యమైన ఖనిజ లవణమిశ్రమం(మినరల్ మిక్సర్) పశు పోషకులకు అందుబాటులోకి తీసుకరావడం ఓ వరమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దామచర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో తెలామిన్ మినరల్ మిక్సర్ లోగోతే వచ్చిన ప్యాకెట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. విశ్వవిద్యాలయం వారు పశు పోషకులకు లాభసాటిగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ పేరు ప్రతిబింబించేలా ఈ తెలామిన్‌ను ఆవిష్కరించిందన్నారు. ఈ ఖనిజలవణ మిశ్రమం పశువులకు వాడటం ద్వారా పాలదిగుబడి పెరుగుతుందన్నారు. కోదాడ పశుఔషధ బ్యాంకుకు 9.5టన్నుల ఖనిజ మిశ్రమం రాగా 7.5టన్నులను కోదాడ పశువైద్యశాల నుంచి పశుపోషకులకు అందజేశారు. టన్ను నడిగూడెం, అర టన్ను హుజూర్‌నగర్‌కు పంపిణీ చేసినట్లు తెలిపారు. కోదాడ పశుఔషధబ్యాంకు స్ఫూర్తితో ఈ మిశ్రమాన్ని అందించడానికి రూ.5లక్షల రివాల్వింగ్ ఫండ్ కేటాయించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో స్థానిక పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, డాక్టర్ సురేంద్ర ఉన్నారు.


