డిజిటల్ విద్యకు ఇంటర్నెట్ కొరత
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి
పెన్‌పహాడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలు కల్పించినప్పటికీ, కేవలం ఒక వైఫై కనెక్షన్ లేకపోవడం వలన ఆ ప్రయత్నం అసంపూర్ణంగా మారింది. ఏడాది కాలంగా వైఫై సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో, ఉపాధ్యాయులే తమ సొంత సెల్‌ఫోన్‌ల డేటాను వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.
సౌకర్యాలున్నా... సౌలభ్యం లేదు
గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పెన్‌పహాడ్ మండలంలోని పెన్‌పహాడ్, గాజులమల్కాపురం, అనంతారం, అన్నారం వంటి గ్రామాల్లోని పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాల, కేజీబీవీ పాఠశాలల్లో కూడా ప్యానెల్ బోర్డులు, టీవీలతో కూడిన డిజిటల్ సామగ్రిని సరఫరా చేసింది. కొన్ని పెద్ద పాఠశాలల్లో 3 నుంచి 7 ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేయగా, లింగాల, చీదెళ్ల, భక్తాళాపురం, అనాజీపురం వంటి పాఠశాలలకు కూడా 2 చొప్పున బోర్డులను సమకూర్చారు. ఈ ప్యానెల్ బోర్డులన్నీ ఇంటర్నెట్ ఆధారిత విద్యాబోధన కోసమే అయినా వీటికి వైఫై కనెక్షన్‌ను ప్రభుత్వం నేటికీ కల్పించలేదు.
ఉపాధ్యాయులపైనే భారం..
వైఫై సౌకర్యం లేకపోవడంతో, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సెల్‌ఫోన్ల ద్వారా నెట్‌వర్క్‌ను కనెక్ట్ (హాట్‌స్పాట్) చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ నెట్‌వర్క్ మధ్యలో నిలిచిపోవడం లేదా డేటా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల డిజిటల్ తరగతులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇది కేవలం బోధన నాణ్యతపైనే కాక, ఉపాధ్యాయులపై ఆర్థిక భారం కూడా మోపుతోంది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల డిమాండ్లు..
ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. డిజిటల్ ప్యానల్ బోర్డులకు వెంటనే వైఫై కనెక్షన్‌ను ఏర్పాటు చేసి, డిజిటల్ బోధన సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్లాలని అంటున్నారు. ప్రస్తుతం 8–10 తరగతులకు మాత్రమే పరిమితమైన డిజిటల్ పాఠాలను 6, 7వ తరగతి విద్యార్థులకు కూడా బోధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జాడలేని ఉన్నతాధికారుల తనిఖీ..
పాఠశాలల్లో రూ. లక్షలు వెచ్చించి సమకూర్చిన డిజిటల్ సామగ్రి సరిగా పనిచేస్తుందా లేదా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే అంశాలను తెలుసుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల తనిఖీలు పూర్తిగా కరువయ్యాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకోసారైనా ఉన్నతాధికారులు పాఠశాలలను తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చి, సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటల్ తరగతులకు వైఫై సౌకర్యాన్ని కల్పించాల ని ప్రజలు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సూర్యాపేట : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వాటిని బలోపేతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు ఏరియా ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు తాగునీరు, కూర్చోవడానికి కుర్చీలు లేవన్నారు. ఎక్స్‌రే సౌకర్యం లేకపోవడంతో బయటకు వెళ్లి తీయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు, అనంతరం డీఎంహెచ్‌ఓకు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టిపెల్లి సైదులు, నాయకులు పులుసు సత్యం, సోమపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, మట్టపల్లి లక్ష్మీ, గుంజ వెంకటేశ్వర్లు, కడెం కుమార్, పేరుమాండ్ల రాజారావు, లక్ష్మయ్య, రాములు, రామకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో అరకొరగా
కొనసాగుతున్న డిజిటల్ క్లాస్‌లు
వైఫై సౌకర్యం లేకపోవడంతో మొబైల్ నెట్‌వర్క్‌తో బోధిస్తున్న ఉపాధ్యాయులు
డేటా సరిపోక తరగతులకు ఆటంకం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
డిజిటల్ విద్యకు ఇంటర్నెట్ కొరత


