నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గరిడేపల్లి మండలం గడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో, మేళ్లచెరువులో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పొనుగోడు ఊర చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. యల్లాపురంలో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో అదనపు తరగతి గదులను ప్రాంభించిన అనంతరం చింతలపాలెంలో పాఠశాల భవనాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించనున్నారు.
లక్ష్మీనరసింహస్వామికి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి అర్చకులు నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషే కం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చనలు చేశారు.మట్టపల్లిలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
గాలికుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం
కోదాడరూరల్ : పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో కోదాడ, అనంతగిరి, చింతలపాలెం మండలాల పశువైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పశువుకు క్యూఆర్‌కోడ్‌తో కూడిన చెవిపోగును వేసి మరీ గాలికుంటు నివారణ టీకా వేయాలన్నారు. దాంతో టీకాలు వేయని పశువులను సులభంగా గుర్తించవచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకుతోడు సిబ్బంది కొరతతో చింతలపాలెం మండలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయడం ఆలస్యమైందన్నారు. టీకాలు వేసేందుకు ఏడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, పశు వైద్యాధికారులు బి.మధు, సిరిపురపు సురేంద్ర పాల్గొన్నారు.
నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్


