సీఈఐఆర్‌తో 2,340 మొబైల్స్ రికవరీ
ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్
సూర్యాపేట : సీఈఐఆర్ ద్వారా ఇప్పటి వరకు 2,340 మొబైల్స్‌ను రికవరీ చేసినట్లు ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన మొబైల్స్‌ను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్‌ను బాధితులకు అందించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని సైబర్ వారియర్స్ నిరంతర కృషి ఫలితంగానే 102 మొబైల్స్‌ను గుర్తించి వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించామని చెప్పారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పంట డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటూ అపరిచితులు ఫోన్ చేసి బ్యాంకు, ఓటీపీ వివరాలు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహన దారులు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించాలని, సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేట : ఎస్పీ సూర్యాపేట పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశారని, దీని నుంచి వచ్చే మెసేజ్‌లు, సమాచారానికి ఎవరూ స్పందించవద్దని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌నుంచి డబ్బులు అడిగినా, వ్యాపారం బాగుంది పెట్టుబడి పెట్టండి అని అడిగినా స్పందించవద్దని పేర్కొన్నారు.


