ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దు
తిరుమలగిరి(తుంగతుర్తి) : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం తిరుమలగిరి మండలం తొండ, కోక్యానాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లుల వివరాలు, ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏఓ, ఏఈఓతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. టాబ్ ఎంట్రీని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో మంచి మార్కులు, విషయపరిజ్ఞానాన్ని సంపాదిస్తే ఉన్నత చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ రాము, తహసీల్దార్ హరిప్రసాద్, ఏఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ లాజర్, ఎంఈఓ శాంతయ్య, ప్రిన్సిపాల్ మృత్యుంజయ ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


