పంట ఆగం..
పంటంతా వరద పాలైంది
పైసా పరిహారం రాలేదు
ఈ సీజన్ (సెప్టెంబర్)లో పంటనష్టం వివరాలు
భానుపురి (సూర్యాపేట) : అధిక వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఏటా ఏదోవిధంగా పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రధానంగా ఈ రెండేళ్ల కాలంలో అతివృష్టి కారణంగా చేతికి వచ్చిన పంటలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సకాలంలో పరిహారం అందజేయడం లేదు.. ఈ సీజన్‌లో పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పంటల సాగుకు అయిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 6లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా దాదాపు 2.50 లక్షల మందికిపైగా రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని పంటలు సాగుచేస్తున్నారు.
ఫసల్ బీమా లేదు.. పరిహారం రాదు!
జిల్లాలో పంటల బీమా పథకాలు అసలు అమలు కావడమే లేదు. రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం ఈ పంటల బీమా పథకాలకు మంగళం పాడింది. మధ్యలో ఓసారి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసినా.. మండల యూనిట్‌గా పంటల నష్టాన్ని అంచనా వేయడంతో రైతులకు ఏ మాత్రం మేలు జరగడం లేదని వదిలేశారు. కనీసం పదేళ్ల కాలంలో పంటల నష్టాన్ని కూడా అంచనా వేసిన పాపాన పోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా.. ఇప్పటి వరకు ఫసల్ బీమా అమలు చేయకపోగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించడం లేదు.
ముంచుతున్న అధిక వర్షాలు
రెండు, మూడేళ్లుగా వర్షాలు ఏ సమయంలో వస్తున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో కనీసం సాధారణ వర్షాలు కూడా నమోదు కావడం లేదు. తదనంతరం పంటలు చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసి అన్నదాతలు నష్టపోయేలా చేస్తున్నాయి. 2024–25 వానాకాలం సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలో 25,967 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పి 33 శాతానికి మించి నష్టం జరిగితేనే అన్న నిబంధన పెట్టారు. దీంతో ఈ సీజన్‌లో మొత్తం రూ.14.43 కోట్ల పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అంతకు ముందు 2023 ఏప్రిల్‌లో అకాల వర్షాల కారణంగా కోతదశకు వచ్చిన 26,177 ఎకరాల వరిపంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసినా పైసా పరిహారం అందలేదు. అలాగే 2025–26 వానాకాలం సీజన్‌లో తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చింది. ఓ వైపు కోతలు ప్రారంభమైన తర్వాత మోంథా తుపాను 64,939 ఎకరాల్లో పంటలకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయగా.. 33శాతం నష్టం జరిగిన పంట లెక్కలు తేల్చే పనిలో అధికార యంత్రాగం ఉంది. ఇలా ఏటా ఏదోవిధంగా పంటను నష్టపోయినా పరిహారం అందక రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పంటలు నష్టపోయిన వారికి ఎంతోకొంత పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
కోతకొచ్చిన వరిపొలం మోంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు వరద నీటి పాలైంది. ఆత్మకూర్(ఎస్) మర్రికుంట కింద దాదాపు 7 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలుగు నీరంతా పొలం గుండానే వెళ్లింది. ఇప్పటికీ నీరు పారుతూనే ఉంది. పరిహారం ఇస్తే పెట్టుబడిలో కొంతైనా వస్తోంది.
– చిలుముల గోపాల్‌రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్)
2023 ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షానికి దాదాపు 8 ఎకరాల్లో వరిపంట నేలకొరిగి నష్టపోయా. ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా పంట చేతికి రాకుండా పోయింది. బీమా పథకాలు లేకపోవడంతో పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల నష్టం పరిహారం కూడా రాలేదు.
– విసవరం రాంరెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్)
దెబ్బతిన్న పంటలు 25,967 ఎకరాలు
పంటనష్టం అంచనా విలువ రూ.14.43 కోట్లు
మోంథా తుపానుతో పంటనష్టం 64,939 ఎకరాల్లో
ఫ ప్రస్తుత సీజన్‌లో నిండా ముంచిన అధిక వర్షాలు
ఫ 90వేల ఎకరాలకుపైగా పంట నష్టం
ఫ సాయం అందక అప్పుల్లో
కూరుకుపోతున్న రైతాంగం
ఫ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
పంట ఆగం..
పంట ఆగం..
పంట ఆగం..


