ఆయిల్ పామ్ సాగుపై శ్రద్ధపెట్టాలి
కోదాడరూరల్: రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ సాగుపై శ్రద్ధపెట్టాలని, అందుకు అధికారులు కూడా రైతులను ప్రోత్సహించాలని జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, జిల్లా కోఆపరేటివ్ అధికారి పి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ మండలం గుడిబండ రైతువేదికలో పీఏసీఎస్ సీఈఓలు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీస్ సీఈఓలు సంఘం పరిధిలో 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను గుర్తించి జాబితా ఇవ్వాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తే రాయితీపై మొక్కలు, డ్రిప్‌తోపాటు మొక్కల పెంపకానికి పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.4,200 నగదు కూడా అందిస్తామన్నారు. సమావేశంలో కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, టెక్నికల్ హెచ్‌ఈఓ మహేష్, అనిత, ప్రదీప్తి పాల్గొన్నారు.


