విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కోదాడరూరల్: నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను విద్యార్థినులు ధైర్యంగా అధిగమిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్టినేటర్ చైతన్య అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నిర్వహించిన బాలిక చైతన్యం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాట్సప్, ఇన్‌స్ట్రాగాం, స్నాప్‌చాట్లలో ఫొటోలను అప్‌లోడ్ చేయొద్దన్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.నాగజ్యోతి, భవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.


