
ఎమ్మార్పీకి అమ్మలేం!
కోదాడ: యూరియా 50కేజీల బస్తాను ఎమ్మార్పీకే అమ్మాలని అధికారుల ఆదేశాల అమలుపై డీలర్లు చేతులెత్తేస్తున్నారు. హోల్‌సేల్ డీలర్లు రూ.380కి బస్తా ఇస్తున్నారని, దీనికి ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు అదనంగా ఉంటాయని అలాంటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించడం అసాధ్యమని అంటున్నారు. ఈనేపథ్యంలో ఎమ్మార్పీకి అయితే ఈ సీజన్‌లో యూరియా అమ్మవద్దని కోదాడ పట్టణంలో డీలర్ల సంఘం నాలుగు రోజుల క్రితం తీర్మానించింది. ఇది ఈనెల 14 తర్వాత అమలులోకి వస్తుందని ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల డీలర్లు కూడా రెండు మూడు రోజుల్లో ఇదే బాట పట్టనున్నట్లు సమాచారం.
ఎమ్మార్పీకి అమ్మితే నష్టం
ఈ వ్యవసాయ సీజన్‌లో 50 కేజీల యూరియా బస్తాను రూ.266లకు అమ్మాలని ప్రభుత్వం నిర్దేశించింది. క్రిబ్‌కో, ఇఫ్‌కో, కోరమాండల్ కంపెనీలు యూరియాను ముందుగా హోల్‌సేల్ డీలర్లకు, అక్కడి నుంచి రిటెయిల్ డీలర్లకు సరఫరా చేస్తుంటాయి. హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా మారి రూ.266 ఎమ్మార్పీ ఉన్న యూరియా బస్తాను తమకు రూ.380 కి ఇస్తున్నారని, దీనికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అదనంగా పడుతుందని స్థానిక డీలర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మార్పీకి అమ్మడం వల్ల తాము నష్టపోతామని అంటున్నారు. దీనికి తోడు పీఏసీఎస్‌లలో రూ.266లకు కొనుగోలు చేస్తున్న రైతులు తమ వద్ద ఎక్కువ ధర ఉందని గొడవకు దిగుతున్నందున గత్యంతరం లేక ఈ నెల 14 తర్వాత యూరియా అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నామని ఎరువుల డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. అప్పటి వరకు డీలర్ల వద్ద పాతస్టాక్‌ను విక్రయిస్తారని తెలిపింది.
నానో యూరియాతో నానా కష్టాలు
యూరియాకు ప్రత్యామ్నాయంగా రైతులు నానో యూరియా (లిక్విడ్)ను వాడాలని కంపెనీలు, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కానీ దీని వాడకంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. లీటర్ నానో యూరియా ధర రూ. 500 ఉంది. దీన్ని రెండు ఎకరాలకు వాడొచ్చు. దీనిని పొలంలో పిచికారీ చేయడానికి రూ. వెయ్యి ఖర్చు వస్తుందంటున్నారు. పొలం మొత్తం సమంగా పిచికారీ చేయలేక పోతున్నామని అందువల్ల నానో యూరియా వాడలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారు.
సొసైటీలలో ఇతర ఎరువులు
అంటగడుతున్నారు..
ప్రైవేట్ డీలర్లు ఎమ్మార్పీకి యూరియా అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించడం, అధిక ధరలకు విక్రయిస్తుండడంతో రైతులు పీఏసీఎస్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా సొసైటీ అధికారులు కాంప్లెక్స్ ఎరువులతో పాటు, జింక్, కలుపుమందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని షరతు విధిస్తుండడంతో రైతులకు దిక్కు తోచడం లేదు.
రెండు లేదా మూడు బస్తాలు మాత్రమే ఇవ్వాలి..
రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రెండు లేదా మూడు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఈ నెల 1న జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎరువులను కూడా ఈ– పాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు వరినాట్లు వేసిన 20 రోజుల తరువాత మాత్రమే యూరియా వాడాలని దానికి మాత్రమే ప్రస్తుతం యూరియా అమ్మాలని దానిలో పేర్కొన్నారు. ఏ డీలర్ అయినా ఒకే రైతుకు 10 బస్తాల యూరియా అమ్మితే స్థానిక అధికారులు తనిఖీ చేసి లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు.
ఫ యూరియా విక్రయించవద్దని కోదాడలో ఎరువుల డీలర్ల తీర్మానం
ఫ ఈ నిర్ణయం 14 తర్వాత అమలులోకి వస్తుందని ప్రకటన
ఫ జిల్లా వ్యాప్తంగా అదేబాట పట్టనున్న మిగతా డీలర్లు
ఫ పీఏసీఎస్‌లో యూరియాతో పాటు ఇతర ఎరువులు
అంటగడుతున్నారని రైతుల ఆరోపణ
అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి
వానాకాలం సీజన్‌లో ఆయకట్టులో వరి సాగు చేసే రైతులకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. విస్తీర్ణం ఆధారంగా ఎరువులను కొనుగోలు చేయడానికి రైతులకు అనుమతి ఇవ్వాలి. సొసైటీలలో ఆ ప్రాంత రైతులకు సరిపడా ఎరువులను అమ్మేవిధంగా చూడాలి. రైతులకు అవసరం లేని ఎరువులను అంటగట్టవద్దు.
– కొల్లు వెంకటేశ్వరరావు,
జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు
11 నుంచి యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నాం
ఫ నేరేడుచర్ల ఎరువుల
డీలర్ల సంఘం నిర్ణయం
నేరేడుచర్ల : ఈనెల 11 నుంచి యూరియా అమ్మకాలు నిలిపి వేస్తున్నట్లు నేరేడుచర్ల ఎరువుల డీలర్ల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్థానికంగా సమావేశమై తీర్మానించింది. డీలర్ల సంఘం నేతలు మాట్లాడుతూ కంపెనీలు యూరియాను అధిక ధరకు డీలర్లకు అమ్ముతున్నారని అలాంటప్పుడు ఎమ్మార్పీకి ఇవ్వడం సాధ్యంకాదన్నారు. దుకాణాల్లో ఉన్న స్టాకును ఈనెల 10 వరకు విక్రయిస్తామన్నారు. సమావేశంలో డీలర్లు పోలా విశ్వనాథం, లచ్చయ్య, వెంకటేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.