
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి
సూర్యాపేట : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల సాధనకు అనుములపురి జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటుచేసిన నిరుద్యోగ విద్యార్థి మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు సంఘటితమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు వచ్చినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని, మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, పాలకూరి అశోక్, ఓయూ జేఏసీ నాయకులు వేణుకుమార్, చామకూరి రాజు, జి.వి.గౌడ్, ఇంద్ర నాయక్, అర్జున్, దామోదర్ రెడ్డి, నరసింహ నాయక్, ఎల్. నాగేశ్వరరావు, సంజీవ్ నాయక్, నాయక్, భద్రు తదితరులు పాల్గొన్నారు.