
సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
ఫ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా
దిగువకు నీటి విడుదల
ఫ సాగర్ జలాశయానికి చేరుతున్న 50వేల క్యూసెక్కుల నీరు
ఫ ఆయకట్టులో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు
నాగార్జునసాగర్, మిర్యాలగూడ : కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలలోనే జూరాల ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో అక్కడి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మంగళవారం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిత్యం సుమారు 50వేల క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వస్తుండడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ చివరి వారంలో నీటి విడుదలకు అవకాశం
సాగర్ జలాశయ గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. జూన్ మొదటి వారంలో 511.80 అడుగులు (134.7466 టీఎంసీలు)గా ఉంది. బుధవారం నాటికి 517.60 అడుగులకు (144.9362టీఎంసీలు) చేరింది. సాగర్ నీటిమట్టం 540 అడుగులకు చేరి, ఎగువనగల జలాశయాలు గరిష్టస్థాయిలో ఉండి, నదిలో 70 నుంచి 100టీఎంసీల నీరు ఉంటే సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింది 22,12,670 ఎకరాల ఆయకట్టు ఉంది. భూగర్భ జలాలు పెరిగి.. బోర్లు, బావులు, వాగుల ద్వారా మరో లక్ష ఎకరాలు సాగవుతుంది. కుడి, ఎడమ కాల్వల కింద సాగుకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడు సార్లు ఆగస్టు మాసంలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 2017లో అక్టోబర్ నెలలో విడుదల చేశారు. 2015, 2023 సంవత్సరాల్లో కృష్ణాబేసిన్‌కు వరదలు రాక జలాశయాలకు నీరు చేరకపోవడంతో కాల్వలకు నీరివ్వలేదు. ఈ ఏడాది ముందుగానే జలాశయాలకు నీరు చేరుతుండటంతో జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.
గత పదేళ్లుగా నీటి విడుదల వివరాలు ఇలా..
సంవత్సరం నీటిమట్టం విడుదల తేదీ
2014 515 ఆగస్టు 6
2015 510 నీటి విడుదల లేదు
2016 514 ఆగస్టు 26
2017 576 అక్టోబర్ 31
2018 555 ఆగస్టు 23
2019 556 ఆగస్టు 11
2020 556 ఆగస్టు 7
2021 585 ఆగస్టు 5
2022 555 ఆగస్టు 31
2023 506 నీటి విడుదల లేదు
2024 585 ఆగస్టు 2
సాగు పనుల్లో ఆయకట్టు రైతులు
సాగర్‌కు వరద వస్తుండడంతో సాగునీటి విడుదలకు ఢోకా ఉండదనే ధీమాతో ఆయకట్టు పరిధిలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని నార్లు పోసుకుంటున్నారు. వరద ఇలాగే వస్తే ఈ వానాకాలం సీజన్‌తోపాటు యాసంగి సీజన్‌లో కూడా గట్టెక్కినట్లేనని రైతులు భావిస్తున్నారు.
సాగర్‌కు నీటి రాక మొదలైంది
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. నీటి రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా ముందుగానే సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది.
– మల్లికార్జున్, ఎస్‌ఈ, సాగర్‌డ్యాం