
ఎత్తిపోసేది ఎప్పుడు..?
మంత్రి ఆదేశాలతోనైనా..
వారం రోజుల క్రితం లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అయితే అక్కడ వాస్తవ పరిస్థితిని చూస్తే మంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తయ్యే పరిస్థితులు కనబడటం లేదు. వర్షాలు పడితే పనులు చేయడం కష్టంగా మారుతుంది. పనులు ఇలా నిదానంగా కొనసాగితే మరో ఏడాదైనా పూర్తి కాకపోవచ్చని రైతులు పేర్కొంటున్నారు.
కోదాడరూరల్ : రైతులకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులు రెండడుగులు ముందుకు మూడడుగులు వెన్నక్కి అన్న చందంగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతిలేదు. వారం రోజుల క్రితం పనులను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని వారిని ఆదేశించారు.
గత ఏడాది మార్చిలో శంకుస్థాపన
నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌కు అనుసంధానంగా రెడ్లకుంట మేజర్ ద్వారా నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి గ్రామాలకు నీరు అందాల్సి ఉంది. అయితే ఆయా గ్రామాలు మేజర్ కాల్వ ఆయకట్టు చివరన ఉండటంతో నీరందక రైతులు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రెడ్లకుంటతో పాటు ఆయా గ్రామాల రైతులు గతంలో అనేక సార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిల సహకారంతో ప్రభుత్వం రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై లిఫ్ట్ నిర్మాణానికి రూ.47.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత ఏడాది మార్చిలో లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈపనులు పూర్తయితే ఆయా గ్రామాల్లో 4,600 ఎకరాలకు సాగునీటి సమస్య తీరనుంది.
నత్తనడకన పనులు
లిఫ్ట్ పనుల్లో భాగంగా పైప్‌లైన్ వేయాల్సి ఉంది. రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై నీళ్లు ఎత్తిపోసేందుకు విద్యుత్ మోటారు బిగించాల్సి ఉంది. విద్యుత్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు వాగు నుంచి 200మీటర్ల లోపు వరకు పైప్‌లైన్ కోసం గాతు తీసి వదిలేశారు. మిగతా పనులు అసలు మొదలే పెట్టలేదు.
ఫ రూ.47.64కోట్లతో రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై ఎత్తిపోతల పథకం
ఫ పనులు ప్రారంభించి ఏడాది దాటినా కానరాని పురోగతి
ఫ జాప్యంపై మంత్రి ఉత్తమ్ అసహనం
ఫ అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం