
ఉపాధిలో రాణించారు
ఉపాధి పనులను
సద్వినియోగం చేసుకోవాలి
జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవా లి. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడునెలల్లోనే పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉపాధి పని చేయాలనుకుంటే సంబంఽధిత క్షేత్ర సహాయకులను సంప్రదించి జాబ్‌కార్డులను పొందవచ్చు.
– వి.వి.అప్పారావు, డీఆర్‌డీఓ, సూర్యాపేట
నాగారం : మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా.. కుటుంబ పోషణకు కావాల్సిన ఆర్థిక సహకారం తమ వంతుగా అందిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలి పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ పార, గడ్డపార పట్టి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు ఊరు వదిలి పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకునే వారు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే కూలి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ(2025–26) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు నెలల్లోనే పురుషుల కంటే మహిళలు ఎక్కువ పని దినాలను
వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు.
జాబ్ కార్డులు పరిశీలిస్తే...
ఉపాధి హామీ పథకం ప్రారంభించిన కొత్తలో పురుషులే కూలి పనులకు వెళ్లేవారు. తర్వాత రోజుల్లో క్రమంగా మహిళలు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో అతివలే ముందంజలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడునెలల్లోనే పనిదినాలను పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 2.15లక్షల మంది కూలి పనులు చేస్తే వీరిలో మహిళలు 1.25 లక్షల మంది ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పని దినాలు చేసి తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఉపాధి కూలీలు చేసిన మొత్తం పనిదినాలు 24.64లక్షల్లో 15.13లక్షల పనిదినాలను మహిళలు వినియోగించుకున్నారు.
సాగుతున్న పనులు..
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు, నర్సరీల పెంపకం పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకంలో మేకలు, పశువుల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణాలు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
రూ.6.19 కోట్లు ఖర్చు..
జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల్లోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.6.19 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు, ఫాంపాండ్, ఫిష్ పాండ్, ఇంకుడు గుంతలు, పొలాల్లో కట్టలు, నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం, ఇతరత్రా పనులు చేపట్టారు.
2025–26లో మూడునెలల్లోనే
1.25 లక్షల మంది మహిళలు ఉపాధి బాట
పురుషుల కంటే అధికంగా పనులకు హాజరు
ఎక్కువ పనిదినాలు సైతం వినియోగం
ఉపాధి పనుల వివరాలు
జాబ్ కార్డులు : 2.63 లక్షలు
కూలీలు మొత్తం : 5.70 లక్షలు
ఖర్చయిన నిధులు : రూ.6.19 కోట్లు
పనిచేసిన కూలీలు : 2.15 లక్షలు
మహిళలు : 1.25 లక్షలు
పురుషులు : 90 వేలు
మొత్తం పని దినాలు : 24.64 లక్షలు
మహిళ పనిదినాలు : 15.13 లక్షలు
పురుషుల పనిదినాలు : 9.51 లక్షలు

ఉపాధిలో రాణించారు