
మూడు, నాలుగు రోజులకు ఒకసారి..
కోదాడ: కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండి దోమల బెడద పెరిగింది. మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లో కాకుండా కోదాడ పెద్దచెరువు, అనంతగిరి రోడ్డు, బైపాస్ సర్వీస్ రోడ్ల వెంట వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడ మార్నింగ్ వాక్‌కు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండి దోమలు, పందులకు నిలయంగా మారుతున్నాయి. ఈ సమస్య ప్రధానంగా భవానీనగర్, నయానగర్‌లో తీవ్రంగా ఉంది.
ఇది కోదాడ పట్టణంలోని నయానగర్‌లో అనంతగిరికి వెళ్లే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం. చిన్న వర్షం వచ్చినా నీరు నిల్వ ఉండి మురికి కూపంగా మారుతుంది. దీనిపై అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు అంటున్నారు. స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి నీరు నిల్వ ఉండకుండా మట్టిపోయించాలని కోరుతున్నారు.

మూడు, నాలుగు రోజులకు ఒకసారి..