యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండకు దిగువన ఉన్న లక్ష్మీ పుష్కరిణి సమీపంలో మతిస్థిమితం లేని యువకుడు ఇద్దరు భిక్షాటన చేసే వృద్ధ మహిళలపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా లక్ష్మీ పుష్కరిణి చెంత ఇద్దరు వృద్ధ మహిళలు భిక్షాటన చేస్తున్నారు. అక్కడే మతిస్థిమితం లేని యువకుడు కూడా ఉంటున్నాడు. అతడికి చెవులు వినిపించవు. శనివారం ఇద్దరు వృద్ధ మహిళల్లో ఒకరు భిక్షాటన చేసేందుకు వస్తుండగా.. సదరు యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కడుపులో తన్నాడు. వెంటనే ఆమె బీటీ రోడ్డుపై పడటంతో తలకు గాయమైంది.
ఆమెకు కాపాడేందుకు వచ్చిన మరో వృద్ధ మహిళను సైతం ఆ యువకుడు కొట్టి గాయపరిచారు. స్థానిక హోటల్ నిర్వాహకులు, దుకాణదారులు, యువకులు ఆ మతిస్థిమితం లేని యువకుడిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. గాయపడిన వృద్ధ మహిళలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదివారం సీఐ భాస్కర్‌ను వివరణ కోరగా.. గతేడాది సైతం ఆ యువకుడు పలువురిపై దాడి చేసి గాయపరిచాడని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. మహిళను కడుపులో తన్నుతూ, దాడి చేసిన వీడియో అక్కడే ఉన్న హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యింది అన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
చందంపేట: నేరెడుగొమ్ము మండలం బచ్చాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ లష్కర్(34) ఆదివారం తన వ్యవసాయ పొలంలో బోరు మోటారు ఆన్ చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.