
వైద్యం వికటించి బాలుడి మృతి
సూర్యాపేట టౌన్: వైద్యం వికటించి మూడు నెలల బాలుడు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆదివారం ధర్నా చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటోత్ జలంధర్, మనీషా దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. నాలుగు రోజుల క్రితం బాలుడికి జ్వరం రావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైమ్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదటి రెండు రోజులు బాగానే ఉందని చెప్పిన వైద్యుడు.. ఆదివారం బాలుడి ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పాడని, ఖమ్మం తీసుకెళ్లాక బాలుడు మృతిచెందాడని అక్కడి వైద్యులు తెలిపాడని బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. ప్రైమ్ పిల్లల హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేశారు. హాస్పిటల్‌లో సరైన వసతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్‌ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ
ఆస్పత్రి ఎదుట ఆందోళన
పోలీసులు రావడంతో ఉద్రిక్తత
బాధితులు రాళ్లు రువ్వడంతో
కానిస్టేబుల్‌కు గాయాలు

వైద్యం వికటించి బాలుడి మృతి