
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం
ఫ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశాం
ఫ హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 10బెడ్ల చొప్పున కేటాయించాం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్
వివిధ శాఖల అధికారుల సహకారంతో..
జిల్లాలో వివిధ శాఖల అధికారుల సహకారంతో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకుంటున్నాం. మే 30న కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మురుగు గుంతల్లో మట్టి పోయించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం వంటివి వెంటనే చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంచినీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మంచినీళ్లు కలుషితం కాకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశాలిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారికి సూచనలు చేశారు. ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లా, మండల స్థాయిలో
ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు
జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. ఈ టీమ్‌లలో ఫిజీషియన్, పీడియాట్రిక్ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా విషజ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలినట్లు సమాచారం వస్తే వెంటనే ఆ టీమ్‌లు అక్కడికి చేరుకొని వైద్య సేవలను అందిస్తాయి. అక్కడ వ్యాధులు ఎలా ప్రబలాయి అనే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాయి. వెంటనే టెస్టింగ్‌లు చేసి వారికి మందులు అందజేస్తాయి.
అందుబాటులో టెస్టింగ్ కిట్లు
జిల్లాలో సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్‌ను తెలుసుకునేందుకు టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. డెంగీకి 28,701 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మలేరియాకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 38,717 ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో అత్యవసరమైన మందులు సైతం అందుబాటులో ఉన్నాయి. 58,600 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. దోమల నివారణకు మురుగు కాల్వల్లో పైరాత్రమ్ లిక్విడ్, ఆబేగ్ ట్యాబ్లెట్లను వేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం.
ప్రత్యేకంగా బెడ్లు రిజర్వ్‌లో ఉంచాం
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లాలోని హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రిలో 10 బెడ్లు, కోదాడ ఏరియా ఆస్పత్రిలో పది బెడ్లు, సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 10బెడ్ల చొప్పున అందుబాటులో ఉంచాం. అత్యవసర సమయంలో వాటిని వినియోగిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలందిస్తాం.
ప్రతి శుక్రవారం డ్రైడే
ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమలకు ఆవాసాలైన నీటి గుంతలు, తొట్లు, కుండలు, చెడిపోయిన కూలర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, పాత టైర్లలో నిలిచిన నీటిని పారబోయించేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్లి ఎవరైనా జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అనే వివరాలను తెలుసుకొని వారికి అవసరమైన మందులు అందిస్తున్నాం.
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని వడబోసుకొని తాగాలి. వేడి వేడి పదార్థాలు తినాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్యా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం