
మూడంచెల్లో ప్రగతి పరిశీలన
కనీస సామర్థ్యాలు సాధించేలా..
ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశానుసారం జిల్లాలో పకడ్బందీగా బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తాం. విద్యార్థుల ప్రగతికి ఈ పరీక్షలు కొలమానంగా నిలుస్తాయి. బేస్‌లైన్ పరీక్షల ఆధారంగా కనీస సామర్థ్యాలు లేని విద్యార్థులను గుర్తిస్తాం. వీరు 45 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా కనీస సామర్థ్యాలు సాధించేలా చూస్తాం. జిల్లాలో ఆగస్టు31 నాటికి విద్యార్థులందరికీ వంద శాతం కనీస సామర్థ్యాలు సాధించేలా చర్యలు చేపట్టాం.
– దేవరశెట్టి జనార్దన్, జిల్లా కోఆర్టినేటర్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్
తిరుమలగిరి(నాగారం) : తరగతిలో చేరినప్పటి నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు 1 నుంచి 9 తరగతుల విద్యార్థుల ప్రగతిని పరిశీలించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను అభ్యసన సామర్థ్యాలపై మూడంచెల్లో (ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ, బేస్‌లైన్) పరీక్షలు నిర్వహించనుంది. ప్రధానమైన బేస్‌లైన్ పరీక్షను బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సంబంధిత ప్రశ్నాపత్రాలను తరగతుల వారీగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందజేశారు. ఆయా పరీక్షల మూల్యాంకన వివరాలను జూలై 15 నాటికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
సామర్థ్యాన్ని అనుసరించి ప్రణాళిక
విద్యా సంవత్సరం ఆరంభంలో బేస్‌లైన్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోని అంశాలపై నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఫలితాల ఆధారంగా వారిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. వెనుకబడిన వారికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం బోధన చేపడతారు. కరోనా తర్వాత విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధనా ప్రణాళికలుంటాయి. 6 నుంచి 9 తరగతుల వారికి లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (లిప్) కార్యక్రమాన్ని చేపడతారు. నవంబర్ 25 నుంచి 30వరకు రెండో (మిడ్ లైన్), విద్యా సంవత్సరం ముగింపున మార్చి5 నుంచి 7వరకు చివరి (ఎండ్‌లైన్ ) పరీక్షలుంటాయి. ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసనను మెరుగుపరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రగతి తీరుపై తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు.
ఫ నేటి నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులకు అభ్యసన సామర్థ్య పరీక్షలు
ఫ ఎస్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలు జారీ
ఫ మూల్యాంకన వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్‌లోడ్

మూడంచెల్లో ప్రగతి పరిశీలన