
కార్యకర్తలకు అండగా ఉంటా
తుంగతుర్తి : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని అద్దంకి దయాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తాన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తుంగతుర్తి అని, ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కరడుగట్టిన కాంగ్రెస్ వాది మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తనకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తండ్రిలా అండగా నిలిచారని గుర్తు చేశారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి దయాకర్ తన కొడుకు లాంటివాడని, కాంగ్రెస్ పార్టీకి దయాకర్ సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మున్ముందు మంత్రి పదవితో పాటు ఉన్నతమైన పదవులను దయాకర్ అధిరోహించాలని ఆకాంక్షించారు. త్వరలో దయాకర్‌కు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం దామోదర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి వెంట ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, నాయకులు గుడిపాటి నర్సయ్య, దొంగరి గోవర్దన్, కొండ రాజు, పెండెం రామ్మూర్తి, రామడుగు నవీన్ చారి, అనిల్ క్యాస్ట్రో, టైగర్ వెంకన్న, ప్రభు తదితరులు ఉన్నారు.
ఫ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్