
పంద్రాగస్టు నాటికి పరిష్కారం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ భారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20 వరకు 17 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 15 రకాల సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో రెవెన్యూ సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఆగస్టు 15లోగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 1,136 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,01,605 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు. అయితే ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, ఫౌతితో పాటు అసైన్డ్ భూముల సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్‌పైనే దరఖాస్తులు అధికంగా వచ్చాయి.
ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన..
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో పెద్ద ఎత్తున భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూ భారతిని తీసుకొచ్చింది. అన్ని భూ సమస్యలను పరిష్కరించేలా భూ భారతిలో ఆప్షన్లను సిద్ధం చేసింది. 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి పరిశీలిస్తున్నారు.
సాదాబైనామాలు పెండింగేనా..!
ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే సాదాబైనామాల విషయం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అవి తప్ప మిగిలిన సమస్యలన్నింటికీ ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపనున్నారు. ఆలోగా సాదాబైనామాలను పరిష్కరించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉంది.
ఫ రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు
ఫ వాటి పరిశీలన ప్రారంభించిన అధికారులు
ఫ మండల స్థాయిలోనే కేటగిరీల వారీగా విభజన
ఫ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్
స్థాయిలో ఆగస్టు 15 నాటికి
పరిష్కరించేలా ప్రణాళిక
దరఖాస్తుల వివరాలు
జిల్లా దరఖాస్తులు
నల్లగొండ 42,534
సూర్యాపేట 44,741
యాదాద్రి 14,330
మొత్తం 1,01,605