
నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం
కోదాడరూరల్ : నేరాల నియంత్రణలో , నేరస్తులను గుర్తించడంతో సీసీ కెమెరాలు కీలకం అవుతున్నాయని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.27.50లక్షలతో ఏర్పాటు చేసిన 70 కెమెరాల పోలీస్ కంట్రోల్ రూంను ఎస్పీ నరసింహతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కోదాడ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు తమ అపార్ట్‌మెంట్‌లు, గృహాలు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ నేరాలను కట్టడి చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతు నేరాల కట్టడికి సీసీ కెమెరాలను అన్నివిధాలుగా ఉపయోగించుకుంటున్నామని దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. సూర్యాపేటను పూర్తి స్థాయిలో రక్షణ జిల్లాగా చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు శివశంకర్, రజితారెడ్డి, సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ దశరథ, భరత్‌రెడ్డి, రంగారావు, డాక్టర్ సురేష్, డాక్టర్ రామారావు, కోటేశ్వరరావు, ఆనంద్ పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే పద్మావతి