
కొత్త అడ్మిషన్లు 5,289
సూర్యాపేటటౌన్ : విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన బడిబాట గురువారం (19వతేదీ)తో పరిసమాప్తం అయ్యింది. రోజువారీ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ బడిబాటను కొనసాగించారు. దీంతో ఈ ఏడాది కొత్తగా 5,289 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే గతేడాది ఆగస్టు 31వ తేదీ వరకు 4,814 అడ్మిషన్లు రాగా ఈసారి అదనంగా 475 అడ్మిషన్లు పెరిగాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల సంఖ్య పెరగనుందని జిల్లా విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు.
కోదాడ మండలంలో అత్యధికంగా..
జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 182 ప్రభుత్వ ఉన్నత, 78 ప్రాథమికోన్నత, 690 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అలాగే తొమ్మిది మోడల్ స్కూల్స్, 18 కేజీబీవీలు, ఒక రెసిడెన్షియల్ పాఠశాలల్లో వీటిలో 75వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బడిబాటలో ఇప్పటి వరకు 5,289 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందగా ఇందులో కోదాడ మండలంలో అత్యధికంగా 708 మంది, మఠంపల్లి మండలంలో అత్యల్పంగా 79 మంది ఉన్నారు.
తెరుచుకున్న పాఠశాలల్లో 32 మంది చేరిక
జిల్లాలో మొత్తం 95 ప్రభుత్వ పాఠశాలలు గతేడాది విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డాయి. అయితే ఈ ఏడాది బడిబాట కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థుల చేరికతో 12 పాఠశాలలు తెరుచుకున్నాయి. చింతపాలెం మండలంలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మూత పడగా ఈ ఏడాది రెండు తెరుచుకున్నాయి. అలాగే జాజిరెడ్డిగూడెం మండలంలో నాలుగు మూతపడగా మూడు తెరిపించారు. మఠంపల్లిలో 10 పాఠశాలలు మూతపడగా ఒకటి, మేళ్లచెరువులో మూడు పాఠశాలలు మూతపడగా ఒకటి, నడిగూడెం మండలంలో ఐదు పాఠశాలలకు ఒకటి, పెన్‌పహాడ్ మండలంలో రెండు మూతపడగా ఆ రెండు తెరుచుకున్నాయి. తిరుమలగిరిలో నాలుగు పాఠశాలలు ఉండగా ఒక పాఠశాలను తెరిపించారు. తుంగతుర్తి మండలంలో ఎనిమిది పాఠశాలలు మూతపడగా ఒక పాఠశాలను తెరిపించారు. ఈ పాఠశాలల్లో మొత్తం 32 మంది విద్యార్థులు చేరారు.
సమష్టి కృషితోనే విజయవంతం
ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయుల సమష్టి కృషితో విజయవంతంగా ముగిసింది. బడిఈడు పిల్లలను బడిలో చేర్చించేందుకు ఇంటింటి ప్రచారం చేశాం. దీంతో ఈ ఏడాది అత్యధికంగా అడ్మిషన్లు వచ్చాయి. 12 మూతపడిన పాఠశాలలను తెరిపించాం.
– అశోక్, డీఈఓ
ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన ప్రవేశాల సంఖ్య
ఫ గతేడాది కంటే 475 అదనం
ఫ మూతపడిన 12 స్కూళ్లను
తెరిపించిన విద్యా శాఖ
ఫ ముగిసిన బడిబాట కార్యక్రమం
విద్యార్థుల చేరిక ఇలా..
ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 950
1వ తరగతిలో ప్రవేశం 2,038
ప్రైవేట్ నుంచి వచ్చినవారు 1,410
2 నుంచి 10వ తరగతి వరకు 1,841
ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకం
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తూ నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు అందిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు పాఠశాలలపై ఆరా తీస్తూ ఎంఈఓలు, హెచ్‌ఎంలకు దిశానిర్దేశం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సన్మానించారు. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు.

కొత్త అడ్మిషన్లు 5,289