
‘ఈవీ’లకు నో పవర్!
చార్జింగ్ సౌకర్యం లేక రోడ్డెక్కని ఎలక్ట్రిక్ బస్సులు
ఫ ప్రత్యేక లైన్, సబ్‌స్టేషన్ ఏర్పాటులో అలసత్వం
ఫ నల్లగొండ డిపోకు 15 రోజుల క్రితం వచ్చిన 40 ఎలక్ట్రిక్ బస్సులు
ఫ వాటిని నార్కట్‌పల్లి డిపోలో
ఉంచిన అధికారులు
ఫ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో డిపోలు దాటని బస్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సు(ఈవీ)లకు చార్జింగ్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన చార్జింగ్ కోసం విద్యుత్ లైన్, సబ్‌స్టేషన్ నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఆ పనుల కోసం మూడు నెలల కిందటే టెండర్లు పిలిచినా కాంట్రాక్టు సంస్థ అలసత్వంతో ఈవీ బస్సులు రోడ్డెక్క లేదు. దీంతో నల్లగొండ డిపోకు కేటాయించిన 40 ఈవీ బస్‌లను నార్కట్‌పల్లి డిపోలో భద్రపరిచారు. సూర్యాపేట, నల్లగొండ డిపోలకు ఒకేసారి ఈవీ బస్‌లు వచ్చాయి. 11 కేవీ లైన్, సబ్‌స్టేషన్, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ బాధ్యతలను రెండుచోట్ల ఒకేసారి కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. సూర్యాపేటలో ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయి బస్‌లు రోడ్డెక్కగా, నల్లగొండలో మాత్రం పనుల్లో జాప్యం జరుగుతోంది.
పనుల్లో ఎడతెగని జాప్యం
ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీిసీ ఈవీ బస్‌లను తీసుకొస్తోంది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట డిపోలకు ఎలక్ట్రిక్ బస్‌లను మంజూరు చేసింది. అందుకోసం ఈ రెండు డిపోల్లో ప్రత్యేకంగా 133/11 కేవీ లైన్, సబ్‌స్టేషన్ నిర్మించాల్సి ఉంది. వాటితోపాటు జనరేటర్ల ఏర్పాటు, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఒకే కాంట్రాక్టర్ కాంట్రాక్టు పొందినప్పటికీ సూర్యాపేటలో పనులను ఎప్పుడో పూర్తి చేశారు. ఈ నెల 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూర్యాపేటలో ఈవీ బస్సులను ప్రారంభించారు. నల్లగొండ డిపోలో మాత్రం ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నా, ప్రత్యేక లైన్, సబ్‌స్టేషన్ పనుల్లో వేగం పుంజుకోవడం లేదు.
నెలాఖరు వరకు రోడ్డెక్కేది అనుమానమే
ఎలక్ట్రిక్ బస్సులు జిల్లాకు చేరి 15 రోజులు కావస్తోంది. విద్యుత్ లైన్, సబ్‌స్టేషన్ పనులేవీ చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించి.. రాత్రింబవళ్లు పనిచేసినా ఈ నెలాఖరు వరకు కూడా అవి పూర్తికావు. బస్ డిపోలో ఇప్పటివరకు జనరేటర్లను ఏర్పాటు చేసి, ఛార్జింగ్ పాయింట్ల పనులను మాత్రమే చేపట్టారు. విద్యుత్ లైన్, సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తేనే వాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు బస్సులు డిపోకు పరిమితం కావాల్సిందే.