
రూ.271.20 కోట్ల రైతు భరోసా నిధులు జమ
భానుపురి (సూర్యాపేట): రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,61,912 మంది రైతుల ఖాతాల్లో రూ.271.20 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవర్ తెలిపారు. వానాకాలం–2025 సీజన్‌కు సంబంధించి జిల్లాలో మొత్తం 2,89,371 మంది రైతులకు నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందని పేర్కొన్నారు. రైతులు కొత్త పాస్ బుక్కులు (05.06.2025 రోజు వరకు) వచ్చిన వారు వ్యవసాయ విస్తరణాధికారులను కలిసి సరైన పత్రాలను సమర్పించాలని కోరారు.
రైతు భరోసా అందించాలి
తుంగతుర్తి : తమకు రైతు భరోసా రావడం లేదని తుంగతుర్తికి చెందిన గుడిపూడి ఆగారావు, శంకరమంచి రవీందర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తుంగతుర్తిలో ఏఓ బాలకృష్ణకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి శివారులో తమకు మూడకరాల లోపు ఉన్న వ్యవసాయ భూములకు గతంలో రైతు భరోసా అందిందని, గడచిన నాలుగు పర్యాయాలుగా ఆగిపోయిందన్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా విచారణ జరిపి రెవెన్యూ రికార్డులు సక్రమంగానే ఉన్నాయని తెలిపారన్నారు. కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. రైతు భరోసా ఇవ్వకపోగా మీ భూముల సర్వే నంబర్లు కనిపించడం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటిఐనా రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.