
మందుల కొరత లేకుండా చూడాలి
నడిగూడెం : ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొత్తం తిరిగి ఆవరణను పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, కూరలను పరిశీలించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. పాఠశాల భవనం పై భాగంలో నీరు నిల్వ ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మన గ్రోమోర్ ఎరువుల షాపును కూడా తనిఖీ చేశారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి సీతారామ్ నాయక్, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏడీఏ యల్లయ్య, డాటాఎంట్రీ ఆపరేటర్ జ్యోతి, లక్ష్మి, కామేశ్వరి తదితరులున్నారు.