
యువ వికాసానికి ‘సిబిల్’ గుబులు
తిరుమలగిరి (తుంగతుర్తి): యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుదారుల్లో బ్యాంకు సిబిల్ స్కోర్ గుబులు పట్టుకుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రాయితీ రుణాలు ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువత నుంచి జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 52,069 మంది దరఖాస్తులు అందాయి. ఇదంతా బాగానే ఉన్నా యువ వికాసం రుణాలు రావాలంటే తప్పనిసరిగా బ్యాంకు సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. అయితే బ్యాంకులకు పంపిన దరఖాస్తు ఫారాల అభ్యర్థుల సిబిల్ స్కోర్‌ను చూసి మరలా వాటిని కార్యాలయానికి పంపుతారు. బ్యాంకు సిబ్బంది అందుకు పాన్ కార్డు ప్రామాణికంగా చేసుకొని జాబితాను తయారు చేయనున్నారు. సిబిల్ స్కోర్ ప్రామాణికంగా రాజీవ్ యువ వికాసం రుణాలు అందిస్తామనడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది.
రూ.4 లక్షల రుణానికి అధిక అర్జీలు
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాల్లో అత్యధికులు రూ.4 లక్షల రుణం కావాలని దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం వివిధ రకాల వ్యాపారులకు ఒక్కో రకమైన యూనిట్ విలువను ముందుగానే కేటాయించారు. దరఖాస్తుదారులు ఆ రకంగా అందులో తమకు నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోవాలి. రూ.50 వేలు రుణం తీసుకుంటే 100 శాతం రాయితీ కల్పిస్తారు. అంటే తిరిగి రుణం చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగతా రూ.50 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంటే 70 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో అర్హుల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు కలిపి 52,069 మంది రుణాలకు దరఖాస్తులు చేసుకోగా ఇందులో 80 శాతం మంది రూ.4 లక్షల రుణం కావాలని పేర్కొనడం విశేషం.
మహిళలకు ప్రత్యేక కోటా
కొత్తగా మొదటిసారి రుణం తీసుకునే వారికి ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనికితోడు సంబంధిత వ్యాపారంలో అనుభవం ఉండే వారికి సైతం ప్రాధాన్యత కల్పించనున్నారు. మొత్తం కోటాలో దివ్యాంగులకు 5 శాతం, మహిళలకు 20 శాతం యూనిట్లు కేటాయించాలని ఉత్తర్వులు ఉన్నాయి.
ఫ సిబిల్ స్కోర్ 700కు తక్కువుంటే రుణాలు కష్టమే
ఫ రూ.50 వేల కంటే ఎక్కువ
రుణానికి పాన్‌కార్డు తప్పనిసరి
ఫ 52,069 మంది దరఖాస్తు
ఫ రూ.4లక్షల రుణానికి 80 శాతం మంది..