
4.07 టన్నుల సేకరణ లక్ష్యం
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం
లక్షల
సూర్యాపేట : జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లయ్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. వేసవి కాలం కావడంతో తేమ శాతంతో ఇబ్బంది ఉండదని, వరి కోసిన వెంటనే ధాన్యం కొంటామని అధికారులు చెబుతున్నారు.
4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సన్నరకం 2,63,250 ఎకరాలకు గాను 6,58,125 మెట్రిక్ టన్నుల దిగుబడి, దొడ్డురకం 2,10,489 ఎకరాలకు గాను 5,47,271 మెట్రిక్ టన్నులు.. మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఇందులో స్థానిక అవసరాలకు 98,718, విత్తనాలకు 1600 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ వ్యాపారులకు మరో 6,97,142 మెట్రిక్ టన్నులు విక్రయించవచ్చని, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు సెంటర్లకు దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు సివిల్ సప్లయ్ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలోనే ఎన్ని సెంటర్లను ప్రారంభించాల్సి ఉంటుంది..? పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, ఇతరుల ద్వారా ఎన్ని కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాల్సి ఉంటుందోనన్న కసరత్తును రెండుమూడు రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. బోనస్ కారణంగా జిల్లాలో రైతులు సన్నరకాలను కూడా బాగానే సాగు చేయడంతో వీటికోసం వేరుగానే సెంటర్లను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో 25 లక్షల గన్నీబ్యాగులు
గత యాసంగిలో ప్రారంభించినట్లుగానే ఏప్రిల్ మొదటి వారంలోనే సెంటర్లను ప్రారంభించనున్నారు. 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గాను దాదాపు 75 లక్షల గన్నీబ్యాగులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 25 లక్షల గన్నీబ్యాగులు సిద్ధంగా ఉండగా.. కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి మరో 10 లక్షలు గన్నీబ్యాగులను సేకరించనున్నారు. మిగతావాటిని విడతల వారీగా ఎలాంటి కొరత లేకుండా సేకరించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే యాసంగి సీజన్ కావడంతో అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేలా టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచనున్నారు. ఇక ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మిషన్లు సిద్ధం చేశారు.
ఫ కొనుగోళ్ల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
ఫ ఇంకా ఖరారు కాని కేంద్రాలు
ఫ వచ్చే నెల మొదటివారం నుంచి కొనుగోళ్లు
ధాన్యం కొనుగోలు వివరాలు
సాగు విస్తీర్ణం 4,73,739 ఎకరాలు
దిగుబడి అంచనా 12 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు లక్ష్యం 4.07 లక్షల మెట్రిక్ టన్నులు
కావాల్సిన గన్నీ బ్యాగులు 75 లక్షలు
అందుబాటులో ఉన్నవి: 25 లక్షలు
కొనుగోళ్లకు సిద్ధమవుతున్నాం
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభిలా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ అధికారుల దిగుబడి అంచనాలకు అనుగుణంగా త్వరలోనే ఎన్ని సెంటర్లు ప్రారంభించాలో తేలుస్తాం. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తాం.
– ప్రసాద్, సివిల్ సప్లయ్ డీఎం

4.07 టన్నుల సేకరణ లక్ష్యం