‘డబుల్‌’ జాబితా ఏది సారూ!

కోదాడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 
 - Sakshi

560 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ ఎంపిక చేసిన వారి జాబితా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఇదంతా జాబితాను గోల్‌మాల్‌ చేయడానికే..

– ఓ ప్రతి పక్ష నేత ఆరోపణ.

మా వార్డులో కౌన్సిలర్‌కు, ఆయన బంధువులకు రెండు ఇళ్లు వచ్చాయి. ఈ గ్రామంలో లేని ఆయన బావమరిదికి కూడా ఇల్లు వచ్చింది. మాకు అన్ని అర్హతలున్నా ఇల్లు రాలేదు..

ఇది ఓ ఓటరు అనుమానం.

7 ఎకరాల పొలంతో పాటు ఇల్లు కూడా ఉన వ్యక్తిని అర్హుల జాబితాలో చేర్చారు. దీన్ని బట్టే అవకతవకలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవాలి.

– ఇల్లు రాని ఓ బాధితుడి ఆవేదన.

కోదాడ: కోదాడ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు అర్హులను ఎంపిక చేసి 13 రోజులు కావొస్తున్నా జాబితా ప్రకటనలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ విషయంలో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అర్హుల జాబితాను రూపొందించే సమయంలోనే సర్వే సిబ్బంది అనేక అవకతవకలకు పాల్పడ్డారే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇల్లు, భూములు ఉన్న వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ ఎంపికలో, జాబితా వెల్లడిలో పారదర్శకంగా వ్యవహరించలేదని ఇళ్లు రాని బాధితులు అంటున్నారు.

ఏ ప్రాతిపదికన..

కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో 560 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను రెండేళ్ల క్రితం నిర్మించారు. వీటి కోసం దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకోగా 1,611 మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. ఈ జాబితా ఏ ప్రాతిపదికన తయారు చేశారో అర్థం కావడం లేదని పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లే అంటున్నారు. జాబితాను తయారు చేసే సమయంలో సర్వే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా డ్రాతీసిన తరువాత కూడా తుది జాబితాలో పేరు ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని పలువురు డ్రాలో ఇళ్లు పొందిన వారి నుంచి వసూళ్లకు తెరలేపారన్న విమర్శలు కూడా లేక పోలేదు.

కౌన్సిలర్లపై ఒత్తిడి

పట్టణంలోని 35 వార్డుల్లో అర్హుల జాబితాను తయారు చేశారు. లాటరీలో కొన్ని వార్డుల్లో ఒకటి, రెండు ఇళ్లు కూడా రాలేదు. దీంతో ఆయా వార్డుల కౌన్సిలర్ల మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. పలువురు అర్హులు ఆయా వార్డు కౌన్సిలర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తుండడంతో వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియడం లేదని పలువురు వార్డు కౌన్సిలర్లు వాపోతున్నారు. కనీసం అర్హుల జాబితాను అధికారులు తమకు కూడా చూపలేదని, అధికారులు అంతా ఏక పక్షంగా వ్యవహారం నడిపారని వారంటున్నారు. జాబితాలను వెల్లడించక పోతే దానిలో గోల్‌మాల్‌ జరుగుతుందని పలువురు అంటున్నారు. అధికారులు వెంటనే జాబితాలను వెల్లడించాలని కౌన్సిలర్లు కోరుతున్నారు.

జాబితాను వెంటనే వెల్లడించాలి

కోదాడ పట్టణంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. పారదర్శకంగా నిర్వహించామంటున్న అధికారులు అసలు అర్హులు ఎవరు, డ్రాలో ఇళ్లు ఎవరికి దక్కాయనే విషయాన్ని వెంటనే వెల్లడించాలి. దీనిలో అధికారులకు ఉన్న ఇబ్బంది ఏమిటో తెలియడం లేదు. రెండు జాబితాలను వెంటనే వెల్లడించక పోతే బాధితులతో కలిసి ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది.

–కొల్లు వెంకటేశ్వరరావు, సామాజిక కార్యకర్త, కోదాడ

ఫ కోదాడలో డబుల్‌ బెడ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు 13 రోజుల క్రితం డ్రా

ఫ నేటికీ జాబితా ప్రకటించని అధికారులు

ఫ అవకతవకలు జరిగాయని పలువురి ఆరోపణ

ఫనిరసన వ్యక్తం చేస్తున్న అర్హులు

పారదర్శకంగా నిర్వహించాం

కోదాడలో నిర్మించిన 560 ఇళ్లకు డ్రా పద్ధతిలో అర్హులను ఎంపిక చేశాం. అంతా పారదర్శకంగా నిర్వహించాం. అర్హులు ఎక్కువగా ఉండి ఇళ్లు తక్కువగా ఉండడంతో సమస్య వచ్చింది. తుది జాబితాలను తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. త్వరలో వెల్లడిస్తాం. సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని చెబుతున్న వారు నిర్దిష్టంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.

– కిశోర్‌కుమార్‌, ఆర్డీఓ, కోదాడ

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top