
జామతోట
పెద్దవూర: జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏడాదికేడాది పెరుగుతోంది. అందులో మామిడి, అరటి, నిమ్మ, బత్తాయి, జామ పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వేసవిలో తగిన జాగ్రత్తలు చేపట్టకపోతే ఆ చెట్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనై దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఆ ప్రభావం అరటి, మామిడి, బత్తాయి, నిమ్మ, జామ కాయలపై పడితే అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వేసవిలో దిగుబడులు తగ్గకుండా పంటలను కాపాడుకోవచ్చునని ఉద్యానవన శాఖ అనుముల క్లస్టర్ స్థాయి అధికారి కొంపెల్లి మురళి సూచిస్తున్నారు. చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు ఆయన మాటల్లోనే..
మామిడి
మామిడి చెట్లు ప్రస్తుతం పిందె దశలో ఉన్నాయి. ఈ పిందె రాలకుండా నిలబెట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేటు కలిపి పిచికారీ చేసుకోవాలి.లేదా నాలుగు లీటర్ల నీటికి 1 మిల్లీ లీటరు ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేయాలి. దోమ వ్యాపించే అవకాశం కూడా ఉండటంతో దీని నివారణకు లీటరు నీటికి 0.5 మిల్లీ లీటర్ల కాన్ఫిడార్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ కాలంలో పండు ఈగ ఆశించే అవకాశం ఎక్కువ. దీని నివారణకు గాను తోటల్లో లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల మలథీయాన్, 2 మిల్లీలీటర్ల మిథైల్ యుజీనాల్ కలిపి ఎర ద్రావణం తయారు చేయాలి. తర్వాత ఒక్కొక్క ప్లాస్టిక్ పళ్లెంలో 250 మిల్లీలీటర్లు ద్రావణాన్ని పోసి ఎకరాకు నాలుగు చోట్ల ఉంచాలి. ప్యాకింగ్ చేసిన మామిడి కాయలను దూర ప్రాంత రవాణాకు కోసిన 6–8 గంటలలో శీతల గిడ్డంగులలో నిల్వ ఉంచాలి. అందులో 12.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 80–90 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. లేత తోటలలో మొక్కలకు నీరు పెట్టడం ద్వారా ఎండ వేడిమి నుంచి కాపాడుకోవచ్చు.
అరటి
అరటిలో వైరస్ తెగుళ్లు వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల నివారణకు ఒక లీటరు నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. త్వరగా పెరిగే మొక్కలను తోట చుట్టూ 3–4 వరుసలు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. గెలల సగం పూర్తి అయ్యాక కార్శి పంట కోసం ఒక సూది పిలకను వదిలి మిగిలిన పిలకలను కోసి వేయాలి. వేసవిలో గెలల రక్షణకు గెలలకు ఎండు ఆకులను చుట్టి ఎండ నుంచి రక్షించాలి. లేత గెలల తోటలో వడగాల్పులకు ఆకులు పూర్తిగా మాడి పోయి ఎండిపోతాయి. అరటి గెలలు సరిగా తయారుగాక ఎండ వేడిమికి మాడిపోతాయి. ఇటువంటి తోటలకు నీటి తడులు దగ్గర దగ్గరగా ఇవ్వాలి.లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌లను మార్చి, మార్చి జిగురుతో కలిపి వారం రోజుల వ్యవధిలో నాలుగుసార్లు ఆకులు, గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.
బత్తాయి, నిమ్మ
ఈ తోటలలో చెట్లపై మంగు నివారణకు లీటరు నీటికి 3మిల్లీ లీటర్ల డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. అధిక వేడి నుంచి చెట్లను కాపాడుకోవటానికి చెట్ల పొదల్లో ఎండు ఆకులు, వరి పొట్టు పోసుకోవాలి.లీటరు నీటికి 20 గ్రాముల సున్నం కలిపిన ద్రావణాన్ని పల్చటి తెల్లటి పొర ఏర్పడే విధంగా చెట్లపైనా, కాయలపైనా పిచికారీ చేయాలి. ఈ ద్రావణంతో పాటు జిగురు కొద్దిగా కలుపుకుంటే సున్నం ఆకులను, కాయలకు బాగా అతుక్కుని ఎక్కువ కాలం ఉంటుంది.
జామ
జామలో బెరడు తొలిచే పురుగు నివారణకు కాండం రంధ్రాలలో 5 మిల్లీ లీటర్ల డైక్లోరోఫాస్ లేదా కిరోసిన్ పోసి బంక మట్టితో పూడ్చాలి.
సపోటా
లేత సఫోటా తోటలకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. ముదురు తోటలకు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి.
ఫ దిగుబడులపై ఎండ ప్రభావం
చూపే అవకాశం
ఫ మామిడికి పండు ఈగ
ఆశించకుండా మందుల పిచికారీ
ఫ అరటి ఆకుల చుట్టూ ఎండు ఆకులు చుట్టాలి
ఫ ఉద్యానవన శాఖ అనుముల క్లస్టర్ అధికారి కొంపెల్లి మురళి సూచనలు

అరటి తోట

సపోట

మురళి, ఉద్యానవన శాఖ అధికారి
