
ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆటలా?
అసెంబ్లీలో ప్రస్తావించినా..
ఇచ్ఛాపురం నియోజకవర్గ కేంద్రంలో వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ జరిగేదని, దాన్ని శ్రీకాకుళం తరలించడంతో ఆటో కార్మికులు అవస్థలు పడుతున్నారని, వెంటనే ఇచ్ఛాపురంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రస్తావించినప్పటికీ తమకు ఇంత వరకు న్యాయం జరగలేదని ఆటో కార్మికులు బహిరంగంగా విమర్శించారు. అటు పాలకులు, ఇటు అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎస్.లక్ష్మీనారాయణ, ఇచ్ఛాపురం ఆటో యూనియన్ అధ్యక్షుడు ఉలాసి యర్రయ్యరెడ్డి, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం రూరల్ : కూటమి ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఇచ్ఛాపురంలో ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు చెందిన సుమారు రెండు వేల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు లొద్దపుట్టి ధనరాజుల తులసమ్మ ఆలయం వద్ద నుంచి ఇచ్ఛాపురం ప్రాంతీయ రవాణా అథారిటి(ఆర్‌టీఓ) కార్యాలయం వద్దకు వాహనాలతో ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయు ప్రతినిధులు, ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లను ఇచ్ఛాపురంలోని ఆర్‌టీఓ కార్యాలయం వద్ద అధికారులు జారీ చేసేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటోల ఫిట్‌నెస్ కోసం 130 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రమ్ముంటున్నారని, దీంతో రెండు వైపులా 260 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాలు ప్రకారం ఆటో 60 కిలో మీటర్ల మేరకు మాత్రమే ప్రయాణించాలన్న నిబంధనలు ఉండగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సుదూర ప్రాంతం ప్రయాణించడం ద్వారా ఒక్కో ఆటో కార్మికుడికి రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని వాపోయారు. ఇప్పటికే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం శ్రీకాకుళం వెళ్లిన ఇద్దరు ఆటో కార్మికులు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం వెళ్లాలా?
ఇచ్ఛాపురంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు
సీఐటీయు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆటలా?