
హడలెత్తిస్తున్న ఆటో గ్యాంగ్
● వృద్ధ అమాయక దంపతులే లక్ష్యంగా చోరీలు
● జిల్లా కేంద్రం సమీపంలో రెండు చోట్ల దొంగతనాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో ఆటో గ్యాంగ్ దడ పుట్టిస్తోంది. మొన్నటికి మొన్న సింహద్వారం సమీపంలో వృద్ధ దంపతుల బ్యాగు ను కోసేసిన దుండగులు.. గురు వారం కింతలి ఫ్లై ఓవర్ సమీప కె.మార్టు నుంచి కొత్తరోడ్డు వెళ్లేందుకు వస్తున్న వృద్ధ దంపతుల నుంచి మూడు తులాల పుస్తెల తాడు ఉన్న సంచిని కోసేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు..
వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురానికి చెందిన వృద్ధ దంపతులు సనపల వెంకటరావు, భారతి గత నెల 26న వైద్యం కోసం శ్రీకాకుళం వచ్చారు. చిన్న చిన్న పనులు ముగించుకుని శంకర్ ఫౌండేషన్‌కు వెళ్లేందుకు రామలక్ష్మణ జంక్షన్ సమీపంలో ఆటో ఎక్కారు. డ్రైవర్ తన పక్కనే వృద్ధుడిని కూర్చోబెట్టుకుని, వృద్ధురాలైన భారతిని వెనక సీట్లో కూర్చోమన్నాడు. అప్పటికే వెనక సీట్లో ఇద్దరు మహిళలున్నారు. శంకర్‌ఫౌండేషన్ వద్ద దిగేటప్పుడు బ్యాగు చినిగినట్టు అనిపించించా పట్టించుకోలేదు. పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్లి చూస్తే బ్యాగులో మూ డు బంగారు వస్తువులు లేవు. దీంతో గురువారం ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదివ్వడంతో ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేశారు.
టూటౌన్ పరిధిలో..
ఎచ్చెర్ల మండలం కొత్తపేట పంచాయతీ సాకివానిపేటకు చెందిన వృద్ధ దంపతులు కోరాడ రమణ, రామలక్ష్మి గురువారం కింతలి మిల్లు ఫ్లై ఓవర్ సమీప కె.మార్టు వద్ద చిలకపాలెం నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. ఇక్కడ కూడా వృద్ధుడిని ముందు కూర్చోబెట్టారు. వెనుక ఇద్దరు మహిళలు ఉన్నారు. సరిగ్గా పాలిటెక్నిక్ కళాశాల సమీ ప వెంకటేశ్వర మెడికల్ షాప్ వద్దకు వచ్చేసరికి సుమారు 3 తులాలుండే పుస్తెలతాడు కట్ అయ్యి జారినట్లు అనిపించడంతో అప్రమత్తమైన వృద్ధురాలు భర్తకు చెప్పడంతో ఆయన తాడును జేబులో ఉంచాడు. కానీ ఆటోలో ఉన్న మహిళలు జేబులో ఉంటే జారిపోద్ది.. మీ చేతిలో ఉన్న మా ర్కెట్టు సంచిలో వేయండంటూ చెప్పడంతో అమాయకంగా రామలక్ష్మి అందులో భద్రపర్చింది.. సరిగ్గా లక్ష్మీటాకీస్ సమీప ముత్యాలమ్మ మార్కెట్టుకు వచ్చేసరికి బ్యాగు కింది భాగం చినిగినట్లు అనిపించి వృద్ధదంపతులిద్దరూ కిందకు దిగారు. ఈలోగా ఆటోవాలా పరారయ్యాడు. దీనిపై రెండో పట్టణ పొలీస్ స్టేషన్‌ను దంపతులిద్దరూ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఆటోల్లో ‘సురక్ష’ కోడ్లు పెట్టినా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు స్పందించి ఆటోగ్యాంగ్ను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.