
మాకొద్దు బాబోయ్..!
● ఫిష్‌పాండ్ పనులపై వేతనదారుల నిరాసక్తత ● తక్కువ వేతనం వస్తుందని అసహనం ● పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్
జింకిభద్ర కొత్త చెరువులో తవ్వుతున్న ఫిష్ పాండ్
సోంపేట:
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న షిష్ పాండ్ పనులు అంటే వేతనదారులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారుల ఒత్తిడితో గ్రామాల్లో ఫిష్ పాండ్ పనులు చేపడుతుంటే చాలీచాలని వేతనాలు అందుతున్నాయని వాపోతున్నారు. మండలంలోని జింకిభద్ర గ్రామంలో తాము పనులు చేయమని వేతనదారులు శనివారం పనులకు వెళ్లకుండా ఆగిపోయిన ఘటన చోటుచేసుకుంది.
ఇదివరకు మట్టితీసే పనులే...
కేంద్ర ప్రభుత్వం గత వార్షిక సంవత్సరం వరకు చెరువులో మట్టితీసి గట్టుపై వేసే పనులు చేపట్టింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల ఆలోచనలతో చెరువు మధ్యలో మరో చెరువు తవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెరువులో నీరు నిల్వ ఉండడంతో పాటు, చేపలు కూడా నిల్వ ఉంటాయని, ఫలితంగా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 5 ఎకరాల పైబడే చెరువుల్లో ఫిష్ పాండ్ తవ్వకాలు చేపట్టాలని ఉపాధి హమీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. చెరువు మధ్య భాగంలో సుమారు 40 అడుగుల పొడవు, వెడల్పుతో పాటు 6 అడుగుల లోతు తవ్వాలని వేతనదారులకు సూచించారు. ఈ పని పూర్తి అవ్వడానికి సుమారు రూ.9 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు వేతనదారులను హడలెత్తిస్తున్నాయి. చెరువులో రెండు అడుగుల లోతు తర్వాత మట్టి తవ్వాలంటే చాలా కష్టమవుతోంది. అందువలన నిబంధనల ప్రకారం పనులు చేపట్టలేకపోతున్నారు. దీంతో వేతనాలు అరకొరగా వస్తున్నాయని చెబుతున్నారు.
సోంపేట మండలంలో...
సోంపేట మండలంలోని సుమారు 15 పంచాయతీల్లో ఫిష్ పాండ్ పనులు మొదలుపెట్టగా అన్నిచోట్ల వేతనదారులు పనులు చేయలేమని చేతులెత్తేశారు. ప్రస్తుతం జింకిభద్ర గ్రామంలో కూడా చేయమని చెప్పేయడంతో ఫిష్ పాండ్ పనులు ఏ పంచాయతీలోనూ పూర్తవ్వని పరిస్థితి నెలకొంది. జింకిభద్ర గ్రామంలో సుమారు 120 మంది వేతనదారులు కొత్త చెరువులో ఫిష్ పాండ్ పనులు చేపడుతున్నారు. మొదటి రెండు వారాలు సరాసరి రూ.200ల వేతనాన్ని అందుకున్నారు. తర్వాత వారం నుంచి వేతనం తక్కువగా వస్తుందని శనివారం పనులకు వెళ్లకుండా నిరసన తెలిపారు. ఫిష్ పాండ్ పనులు చేపడుతుంటే కనీస వేతనం రూ.150లు కూడా అందడం లేదని వాపోతున్నారు. అందుకే ఫిష్‌పాండ్ పనులు చేపట్టకుండా నిరసన తెలియజేస్తున్నామన్నారు. ఇటీవల ప్రభుత్వం కూలీ రేటును రూ.300ల నుంచి రూ.307లకు పెంచింది. కానీ ఎండలో ఫిష్‌పాండ్ పనులు చేస్తుంటే రూ.150లు కూడా రావడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనల మేరకే వేతనం
ప్రభుత్వ నిబంధనలు మేరకు కొలతలు కొలిచి వేతనం వేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేర పనులు చేపడితే పూర్తిస్థాయిలో వేతనం అందుతుంది. మట్టి గట్టిగా ఉండడంతో వేతనదారులు పనులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– ప్రమీల, ఉపాధి ఏపీవో, సోంపేట

మాకొద్దు బాబోయ్..!