
గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని తోటపాలేం గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన దీర్ఘాసి ఈశ్వరరావు (50) సైకిల్ మీద వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న స్కూటర్ ఈనెల 7వ తేదీన ఢీకొంది. దీంతో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వరరావు శనివారం మృతి చెందారు. ఆస్పత్రి వర్గాలు నివేదిక ఆధారంగా ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో జవాన్ మృతి
ఆమదాలవలస: మున్సిపాలిటీలోని ఆరో వార్డు టి.మన్నయ్యపేటకు చెందిన గొద్దు మోహనరావు (46) అనే బీఎస్‌ఎఫ్ జవాన్ గుండెపోటుతో మరణించాడు. న్యూఢిల్లీ లోని బీఎస్‌ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే తోటి సైనికులు మోహనరావును సమీపంలోని ఆస్పత్రికు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం ఉదయం ఆయన మృతదేహం ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు, అక్కడ నుంచి స్వగ్రామానికి చేరుకోనుంది. మోహనరావుకు భార్య సంధ్య, కుమార్తె జాస్మిని, కుమారుడు శశాంక్ ఉన్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
పశువుల వాహనం స్వాధీనం
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం నుంచి విశాఖప ట్నం వైపు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం రాత్రి చిలకపాలేం సమీపంలో జాతీయ రహదారిపై పట్టుకున్నారు. 25 పశువులు అక్రమంగా తరలిస్తుండడంతో వాహనం సీజ్ చేశా రు. పశువులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. పశువులను సంరక్షణ కోసం విజయనగరం గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్ తెలిపారు.
ఏపీఈఏపీ సెట్ పరీక్ష
నిర్వహణకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రం యూనిట్‌గా నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్–2025 (ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెలవు రోజుల్లో మినహా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ముందుగా 19, 20 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్ష నిర్వహిస్తారు. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు చేపడతారు. జిల్లాలో నాలుగు ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిప్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిప్టు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిప్టులో పరీక్షలు నిర్వహిస్తారు. అధికారులు ఈ మేరకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ, చిలకపాలేంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ, టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్‌లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుంచి ఎంపీసీ, బైపీసీ స్ట్రీముల్లో 18,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు నుంచే అనుమతిస్తారు.
గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య
కాశీబుగ్గ: పలాస మండలంలోని లొత్తూరు పంచాయతీ తొసరాడ గ్రామానికి చెందిన సవర వసంతి (22) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇంటి వద్ద వసంతి ఖాళీగా ఉండడంతో తల్లి సవర మహాలక్ష్మి ఏదైనా పనిచేసుకోవాలని సూచించారు. దీంతో కోపంతో శుక్రవారం గడ్డిమందు తాగింది. దీంతో హుటాహుటిన పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వ్యక్తి మృతి