
టీచర్లకు అన్యాయం చేయొద్దు
శ్రీకాకుళం న్యూకాలనీ: బదిలీల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు అన్యాయం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్, జిల్లా అధ్యక్షుడు వడమ శరత్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి సోరి ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞిప్తి చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్, మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పించిన స్టడీ లీవ్ జీవో నంబర్ 342 ప్రకారం ఇన్ సర్వీస్ బీఈడీ చేస్తున్నారని, రెండు నెలల్లో తిరిగి విధుల్లో చేరబోతున్నారని చెప్పారు. కానీ ఇటీవల విద్యాశాఖ చేపడుతున్న బదిలీల్లో వారు పనిచేస్తున్న పాఠశాల పోస్టును క్లియర్ వేకెన్సీగా చూపడం సరికాదన్నారు. వారు పనిచేస్తున్న ప్లేస్‌ను వారికే కేటాయించేలా చూడాలని విన్నవించారు.