
ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు
● ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇషాన్ బాషా
నరసన్నపేట: జల జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇషాన్ బాషా తెలిపారు. శనివారం నరసన్నపేట వచ్చిన ఆయన స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కార్యాలయంలో నరసన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా జిల్లాలో రూ.813 కోట్లు విలువైన 1,793 పనులను ప్రభుత్వం రెన్యూవల్ చేసిందన్నారు. రెన్యూవల్ పనుల్లో 1,546 పనులకు టెండర్లు పిలిచామని, వీటిలో 800 పనులకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి టెండర్లు వేశారని వివరించారు. మరో 746 పనులకు టెండర్లు రావాల్సి ఉందన్నారు. వీటికి కూడా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తే జిల్లాలో దాదాపుగా జల జీవన్ పథకంతో ఇంటింటికీ తాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 5.34 లక్షల గృహాలు ఉన్న ట్లు లెక్కలు ఉన్నాయని, వీటిలో 2.12 లక్షల గృహాలకు కుళాయిలు వేయడం జరిగిందన్నారు. వచ్చే మార్చి నాటికి కనీసం మరో 2 లక్షల గృహాలకు కుళాయిలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
గొట్టా నుంచి నీటి సరఫరాకు ప్రతిపాదనలు
ప్రస్తుతం గొట్టా బ్యారేజీ నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని, ఇది విజయవంతంగా రన్ అవుతోందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాలు శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల ప్రజలకు కూడా గొట్టా బ్యారేజీ నుంచి తాగునీటి సరఫరాకు రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీంట్లో మొదటి విడతగా రూ.900 కోట్లతో నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాలకు అనుమతుల రావొచ్చని పేర్కొన్నారు. కాగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో ప్రస్తుతం మొదటి ఫేజ్‌లో రూ.5.15 కోట్లతో జల జీవన్ పనులు జరుగుతున్నాయని, రెండో ఫేజ్‌లో మిగిలిన భాగాలకు కుళాయిలు వేయడానికి రూ.9.06 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి నరసన్నపేటలో పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ రంగ ప్రసాద్, డీఈ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.