
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆటో డ్రైవర్లు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. దీనిలో భాగంగా స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఆటోలకు క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్, ఓనర్ వివరాలు, ఆటో ప్రయాణించే దిశ, రోడ్డు మార్గం, లోకేషన్ తదితర పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 26 వేల ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం 20 వేల ఆటోలు రవాణా లో ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు డ్రైవర్లు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తి యాప్‌తో ఈ సురక్ష యాప్‌ను రానున్న రోజుల్లో అనుసంధానం చేస్తామన్నారు. అనంతరం ఈ సురక్ష క్యూ ఆర్ కోడ్ యాప్ రూపకల్పన చేసిన ఐటీ కోర్ ఏఎస్‌ఐ బి.రమేష్, ఉత్తమ ఆటో డ్రైవర్లు భాస్కరరావు, శ్రీనివాసరావులను ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ విజయ సారధి, అదనపు ఎస్పీ కేవీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఎంవీ ఐ.గంగాధర్, సీఐలు పైడిపునాయడు, ఇమ్మనుల్ రాజు, ఈశ్వర్‌రావు, అవతారం, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.