తమ్ముడిని బాగా చదివించాలని ఆశ పడ్డాడు. చెల్లెలిని చక్కగా చూసుకోవా లని ఎన్నో కలలు కన్నాడు. కానీ విధి రాత మరోలా ఉంది. 22 ఏళ్ల చిన్న వయసులోనే మృత్యువు అతడిని తీసుకెళ్లిపోయింది. అంతర్ రాష్ట్ర రహదారిపై జమ్ము సమీపంలోని శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సారవకోట మండలం బురద కొత్తూరుకు చెందిన జరజాన సమీర్ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో గడ్డెయ్యపేట జగనన్న కాలనీకి చెందిన చౌదరికి గాయాలయ్యాయి.
బురదకొత్తూరుకు చెందిన సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పొందూరు వద్ద ఒక గ్రామంలో బంధువుల ఇంటిలో గురువారం పెళ్లికి వెళ్లి శుక్రవారం ఉదయం తిలారులో ట్రైన్ దిగి జమ్ము వచ్చాడు. అక్కడే సమీప బంధువు ప్రశాంత్ ఇంట్లో టిఫిన్ చేసి ప్రశాంత్ బైక్‌పై కల్లట గ్రామానికి బయల్దేరాడు. అక్కడ తన మేనత్త జ్యోతి 12 రోజుల కార్యానికి వెళ్లమని తండ్రి చెప్పడంతో బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగా వెనక నుంచి చౌదరి అనే వ్యక్తి బైక్‌పై సమీర్‌ను ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో బైక్‌లు ఒకదానికి ఒకటి తాకడంతో బళ్లు అదుపు తప్పాయి. దీంతో మందాలమ్మ గుడి వద్ద ఆగి ఉన్న లారీని సమీర్ బలంగా ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. చౌదరికి కాలు విరిగింది. నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తండ్రి శ్రీను ఇచ్చిన ిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. – నరసన్నపేట