
‘మత్తు’ను చిత్తు చేద్దాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, వర్కర్లు, ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్లు తెలిసిందని, డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మెడికల్ షాపులన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈగల్ టీంలు మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక నిఘా పెట్టాయని చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 112, 1972 నంబర్లకు తెలియజేయాలని కోరారు. రిమ్స్‌లోని డీ–అడిక్షన్ సెంటర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.