వజ్రపుకొత్తూరు:
మట్టికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది. ఇప్పుడంటే ప్రతి ఇంట్లో స్టీల్ పాత్రలు, ప్లాస్టిక్ క్యాన్‌లలో నీటిని నిల్వ చేస్తున్నాం గానీ ఒకప్పుడు కుండ నీరే దాహార్తిని తీర్చేది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో ప్రతిఒక్కరూ చల్లటి కుండ నీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేవా రు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఫ్రిజ్‌లు రావడం, ఇతర పాత్రలు అందుబాటు ధరల్లో లభ్యం కావడంతో కుండలకు గిరాకీ తగ్గిపోయింది. అయితే వేసవి సీజన్‌లో మాత్రం కుండల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. మట్టి కుండల ప్రాధాన్యతను గుర్తిస్తూ.. ఇంటిలో చల్లని నీరు తాగేందుకు, చలివేంద్రాల కోసం కుండలు కొనుగోలు చేస్తున్నారు. ట్యాప్‌లతో కూడిన కుండలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వారపు సంతల్లో మట్టి కుండల విక్రయాలు భారీ ఎత్తున సాగుతుండటంతో తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.