
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్. చిత్రంలో ఎస్పీ రాధిక
14500
శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎవరు విక్రయించినా, సేవించినా టోల్ ఫ్రీ నంబర్ 14500కు సమాచారం అందించవచ్చని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక శాఖ రూపొందించిన జాయింట్ యాక్షన్ ప్లాన్ అమలుపై బుధవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ జి.ఆర్.రాధిక సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు నెలవారీ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలన్నారు. అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. మత్తు కలిగించే పదార్థాలను విక్రయించే షాపులపై నిఘా పెట్టాలన్నారు. మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మందుల షాపులు, ఇతర ట్రేడర్స్‌తో సమావేశాలు నిర్వహించి చట్టంలోని అంశాలను వివరించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ విద్యాసంస్థల వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి పంట లేదన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వాడకం, రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 14500కు కాల్ చేయాలన్నారు. అంతకుముందు ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు, జిల్లా అటవీశాఖ అధికారి నిశాకుమారి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కిషోర్, సేల్స్ టాక్స్ ఆఫీసర్ జి.రాణిమోహన్, అదనపు ఎస్పీ పి.విఠలేశ్వరరావు, సీపీఓ ప్రవీణ్ కుమార్, ఆర్‌డీఓ బి.శాంతి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, డీఈఓ జి.పగడాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు విక్రయించే షాపులపై నిఘా
అధికారుల సమీక్షలో కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక
