
మాట్లాడుతున్న నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణతో సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని మాజీ ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా రైతు బిడ్డనే అయినా, తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దిగువ స్థాయి వరకు తెలియజేయడం ద్వారా సరైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు వేగవంతంగా జరిగాయన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆర్.బి.కె స్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి రైతులకు చేరవేయాలని సూచించారు. విత్తనాభివద్ధి సంస్థ జిల్లా మేనేజర్, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో ముందుకువెళ్లాలన్నారు. 1962 సంచార పశువైద్య వాహనాలు తరచూ గ్రామాల్లో పర్యటించి పశువులకు వైద్యం అందజేసేలా ప్రణాళికలు రూపొంచాలన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి సకాలంలో రైతులకు ధాన్యం డబ్బులు, కూలి, గోనెసంచుల డబ్బులు సకాలంలో అందజేసినట్లు తెలిపారు. వ్యవసాయ సలహా మండలి బోర్డు చైర్మన్ నేతాజీ మాట్లాడుతూ అందరి సహకారంతో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వంశధార, నీటివనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ డోల తిరుమలరావు మాట్లాడుతూ గుర్రపు డెక్క, షట్టర్ల సమస్యలతో నీటి విడుదలలో కొంత జాప్యం జరిగిందన్నారు. పది రోజుల్లో నీటిని విడుదల చేస్తామన్నారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.జయంతి మాట్లాడుతూ అందరి సహకారంతో పూర్తి స్థాయిలో నిర్దేశిత సమయంలో ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలో చేపడుతున్న పనులను సభ్యులకు వివరించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ పశుబీమా బిల్లులు ట్రెజరీలో ఉన్నాయని తెలిపారు. కె.వి.కె.లో శిక్షణ పొంది ఎన్.జి.రంగా యూనివర్సిటీలో మిల్లెట్స్–2023 అవార్డు అందుకున్న ఎన్.సుజాత చిరుధాన్యాల వినియోగం వల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకుడు డా.ఎం.కిషోర్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాదరావు, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్
త్వరితగతిన ధాన్యం కొన్నామని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ వెల్లడి