బలవంతపు భూసేకరణ ఆపాలి
హిందూపురం: పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి పంట భూములను బలవంతంగా లాక్కోడం దుర్మార్గమని, ఈ ప్రక్రియను తక్షణమే ఆపేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హిందూపురం మండలం రాచేపల్లి, చలివెందుల, మలుగూరు, చర్లపల్లి, బాలంపల్లి, కొండూరు తదితర గ్రామాల్లో బుధవారం వివిధ ప్రజా సంఘాల నాయకులు పర్యటించి భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోవడంతో బలవంతపు సేకరణకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోందని మండిపడ్డారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదన్నారు. కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. రామ్‌కుమార్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల ప్రభాకరరెడ్డి, చైతన్య గంగిరెడ్డి, రైతుసంఘం నాయకులు సిద్ధారెడ్డి, ఓపీడీఆర్ శ్రీనివాసులు, ఎస్‌యూసీఐ నాయకులు గిరి, రంగనాయకులు, రైతు సంఘం నాయకులు కాసీం, కార్మిక నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్


