గుర్తుతెలియని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

Dec 4 2025 9:09 AM | Updated on Dec 4 2025 9:09 AM

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

పెనుకొండ రూరల్‌: ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వృద్ధుడు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ మేరకు కియా పీఎస్‌ ఎస్‌ఐ రాజేష్‌ బుధవారం వెల్లడించారు. పెనుకొండ మండలం దుద్దేబండ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు పక్కన తీవ్రగాయాలతో ఓ వృద్ధుడు పడి ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు కియా పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ రాజేష్‌ కోరారు.

వాహనం ఢీకొని మరొకరు...

పెనుకొండ: స్థానిక శ్రీకృష్ణదేవరాయ జంక్షన్‌లో 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ మేరకు పెనుకొండ పీఎస్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. వ్యక్తి మిస్సింగ్‌ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే పెనుకొండ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

డివైడర్‌పై కుళ్లిన

వ్యక్తి మృతదేహం

పెనుకొండ రూరల్‌: మండలంలోని కొత్తచెరువు మలుపు సమీపంలో 44వ జాతీయ రహదారి డివైడర్‌ మధ్యలో ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కియా పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల పైబడి వయస్సు ఉన్న వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్లిన దశలో పడి ఉంది. డివైడర్‌పై ఏపుగా గడ్డి పెరిగి ఉండడంతో సకాలంలో గుర్తించలేకపోయారు. బుధవారం డివైడర్‌పై గడ్డి తొలగిస్తున్న కార్మికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికిలో మార్చురీకి తరలించారు. మిస్సింగ్‌ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే కియా పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ రాజేష్‌ కోరారు.

వృద్ధుడి దుర్మరణం

లేపాక్షి: బొలెరో ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి గ్రామ పంచాయితీ పరిధిలోని కుర్లపల్లికి చెందిన నారాయణప్ప (70)కు చెవులు సరిగా వినిపించవు. వ్యక్తిగత పనిపై బుధవారం లేపాక్షికి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి దాటుతుండగా కొడికొండ చెక్‌పోస్టు వైపు నుంచి హిందూపురం వైపుగా వేగంగా వెళుతున్న బొలెరో ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై లేపాక్షి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గనుల శాఖ

డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

అనంతపురం టౌన్‌: ఉమ్మడి జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విజయవాడ డీడీగా పని చేస్తున్న శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గత కొంత కాలంగా ఇన్‌చార్జ్‌ డీడీగా అసిస్టెంట్‌ జియాలజిస్టు ఆదినారాయణ విధులు నిర్వర్తిస్తున్నారు.

వడ్డుపల్లికి చేరిన కుడికాలువ నీరు

కూడేరు: మండలంలోని పీఏబీఆర్‌ నుంచి ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాలకు ఈ నెల 1న ధర్మవరం కుడికాలువ ద్వారా విడుదల చేసిన నీరు రెండు రోజుల తర్వాత బుధవారం ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చేరాయి. కుడికాలువ పరిధిలో ఆయా నియోజకవర్గాల్లో 49 చెరువులున్నాయి. తొలుత చివరన ఉన్న తాడిమర్రి మండలం అగ్రహారం చెరువును నీటితో నింపిన తర్వాత అక్కడి నుంచి మిగిలిన చెరువులను నింపుతూ చివరన పీఏబీఆర్‌ దిగువన ఉన్న మరుట్ల చెరువును నింపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement