పెనుకొండ: సామాజిక బాధ్యతలో భాగంగా కియా పరిశ్రమలో పనిచేస్తున్న కొరియన్లు ఓ బృందంగా ఏర్పడి రూ.15 లక్షల విలువ చేసే డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు అందజేశారు. వీటిని కొరియన్ల చేతుల మీదుగా మంగళవారం రాత్రి పెనుకొండలోని సీఐ కార్యాలయంలో ఎస్పీ సతీష్‌కుమార్ అందుకున్నారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పాఠశాలలో క్షుద్ర పూజలు
నల్లచెరువు: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఉపాధ్యాయులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేయించారు.
క్షతగాత్రుడికి అందని వైద్యం
అగళి: స్థానిక పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రుడికి సకాలంలో వైద్యం అందలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వివరాలు... అగళి మండలం బొమ్మసనపల్లికి చెందిన అశోక్ బుధవారం రాత్రి ఆటోలో బొమ్మసనపల్లి గేటు నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొన్నాడు. ఘటనలో అశోక్‌కు తలకు బలమైన రక్తగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతన్ని వెంటనే స్థానికులు అగళిలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే అక్కడ 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన వైద్యులు కానీ, సిబ్బంది కాని లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ లోపు క్షతగాత్రుడి పరిస్థితి విషమిస్తుండడంతో ఆగమేఘాలపై రొళ్లలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
పోలీస్ శాఖకు డ్రోన్లు అందజేసిన కొరియన్లు


