గుప్పుమంటున్న గంజాయి
సోమందేపల్లి: జిల్లాలో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా కొనసాగుతోంది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండక ముందే గంజాయి మత్తులో యువత పెడదారిన పడుతోంది. గత రెండేళ్లుగా హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ ప్రాంతాల్లోని టీ కేఫ్‌ల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగిస్తుండగా... పారిశ్రామిక వాడల్లో బహిరంగంగానే అమ్మకాలు కొనసాగుతుండడం గమనార్హం. మత్తులో యువకులు పరస్పర దాడులకు దిగడం, మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడటం, వాహనాలను శరవేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడి మృతిచెందడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిలో విద్యార్థులు సైతం ఉండడం ఆందోళనకరం.
ఉత్తర భారతం నుంచి దిగుమతి..
పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లో పలు పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటిలో బిహార్, జార్ఘండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు పనిచేస్తున్నారు. తరచూ తమ స్వస్థలాలకు వెళ్లిన వారు అక్కడి నుంచి తిరిగి వస్తూ రైలు మార్గంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. తొలుత తమ వ్యక్తిగత వ్యసనాలకు గంజాయిని వినియోగిస్తున్న వలస కార్మికులను గమనించిన స్థానిక యువత అతి త్వరగా ఆకర్షితులయ్యారు. ఈ రెండేళ్లలో జిల్లాలో గంజాయి వినియోగం భారీగా పెరిగింది. ఇటీవల పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
ప్రమాదాల్లో ఇద్దరు మృతి..
సోమందేపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఏడాది క్రితం గంజాయి మత్తులో బైక్ నడుపుతూ పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద ప్రమాదానికి గురై మృతి చెందాడు. నెల క్రితం సోమందేపల్లి పెద్దకొండ సమీపంలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు కొండపైకి బైక్ నడుపుతూ అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నవాజ్ అనే యువకుడు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మరో ఘటనలో గంజాయి మత్తులో ఓ యువకుడు స్థానిక ఓ పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాజాగా మంగళవారం రాత్రి సోమందేపల్లిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్‌చల్ చేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు.
మత్తులో జోగుతున్న యువత
సోమందేపల్లిలో పేట్రేగిపోతున్న పోకిరీలు


