ప్రతి నీటి బొట్టూ విలువైనదే | - | Sakshi
Sakshi News home page

ప్రతి నీటి బొట్టూ విలువైనదే

Dec 4 2025 9:09 AM | Updated on Dec 4 2025 9:09 AM

ప్రతి నీటి బొట్టూ విలువైనదే

ప్రతి నీటి బొట్టూ విలువైనదే

నల్లమాడ: ప్రతి నీటి బొట్టూ విలువైనదేనని, రైతులు పొదుపుగా వాడుకొని బంగారు పంటలు పండించుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ సూచించారు. బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నల్లమాడలో ఏర్పాటు చేసిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం రాయితీతో అందించే డ్రిప్‌, స్ప్రింక్లర్లతో బిందు సేద్యాన్ని అలవాటు చేసుకొని సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగుచేయాలన్నారు. పీఎం ‘ధన్‌ ధ్యాన కృషి యోజన’ పథకం కింద రైతులు ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో పంటలు సాగుచేసేలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. చిక్కుడు, మల్బరీ, బొప్పాయి, పూలు, కాయగూరల సాగుపై జిల్లా రైతులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమం అనంతరం ప్రజలు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌కు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్‌, పశుసంవర్థక అధికారి సుభదాస్‌, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్‌, ఏపీఎంఐపీ అధికారి సుదర్శన్‌, తహసీల్దార్‌ మనోజ్‌కుమార్‌, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సమీక్ష..

ప్రశాంతి నిలయం: జిల్లాలో చేపట్టిన చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్ట్‌ల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ల పనుల పురోగతి, నీటి నిల్వల వివరాలను ఆరా తీశారు. చిన్న నీటి పారుదల శాఖ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 1,186 చిన్న నీటి ట్యాంకులు ఉండగా... 680 చెరువుల్లో 5.702 టీఎంసీల నీరు ఉందని వివరించారు. యోగివేమన ప్రాజెక్ట్‌లో 0.8 టీఎంసీలు, రామగిరి మండలం అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్ట్‌లో 0.01 టీఎంసీ నీరు ఉన్నట్లు వివరించారు. రూ.3.39 కోట్ల వ్యయంతో 198 చెరువులకు సంబంధించిన పనులు చేపట్టామన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ రాజాస్వరూప్‌ కుమార్‌ మాట్లాడుతూ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా 183 చెరువులను నింపేందుకు 5.08 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, ఇప్పటివరకు 60 చెరువులను 3.10 టీఎంసీ నీటితో నింపామన్నారు. గుడిపల్లి రిజర్వాయర్‌ కోసం చేపట్టిన పనులను ఈ సందర్భంగా వివరించారు.

‘ఎఫ్‌’ లైను దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

భూములు సర్వే సరిహద్దుల నిర్ధారణ కోసం ప్రజల నుంచి అందే ఎఫ్‌ లైను దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ మండల సర్వేయర్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లను హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎఫ్‌ లైన్‌ దరఖాస్తుల పరిష్కారంపై సర్వేయర్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సర్వేయర్లతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. నవంబర్‌ నెలలో ఎఫ్‌ లైన్‌ దరఖాస్తులు 175 అందాయని, వాటిలో కొన్ని అమోదించగా, నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించామన్నారు. మండల సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు తమ పరిధిలో లేని సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, సర్వే శాఖ ఏడీ విజయశాంతి బాయి, మండల సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు పాల్గొన్నారు.

‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement