మెనూకు మంగళం
పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో పోషకాహారం సక్రమంగా అందడం లేదు. మెనూ అమలుకు మంగళం పాడారు. కోడిగుడ్లు, చిక్కీ అందకపోయినా సరఫరాదారులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల కోసం మధ్యాహ్న భోజనం పథకంలో మెనూలో మార్పులు తీసుకురావడంతో పాటు పోషక విలువలు కలిగిన కోడిగుడ్లు, చిక్కీలు చేర్చారు. అంతేకాకుండా సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సహకారంతో విద్యార్థులకు రాగి మాల్ట్ పథకానికీ శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా పోషకాహారం అందుతుండటంతో విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగింది. సెలవులు, పండుగ దినాల్లో సైతం విద్యార్థుల ఇళ్లకు పోషకాహారం అందించారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ఉన్న మధ్యాహ్న భోజన పథకం సరుకుల సరఫరాదారులను తొలగించి అధికార పార్టీకి చెందిన వారికి ఏజెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి విద్యార్థులకు పోషకాహారం సరిగా అందడం లేదు. వారంలో ఐదు రోజులపాటు కోడిగుడ్లు, మూడు రోజులపాటు చిక్కీలు ఇవ్వాలి. ప్రస్తుతం కోడిగుడ్లు మూడు రోజులు మాత్రమే అందుతున్నాయి. ఇక గతంలో ఒక్కో విద్యార్థికి 25 గ్రాముల పరిమాణం ఉన్న చిక్కీ ఇచ్చేవారు. ఇప్పుడు పరిమాణం బాగా కుదించి.. నాణ్యత కూడా తగ్గించేశారు. చాలా పాఠశాలల్లో చిక్కీలు కనిపించడం లేదు. ఎక్కడో అక్కడక్కడ అరకొరగా అందించి మమ అనిపిస్తున్నారని తెలిసింది. మెనూ పక్కాగా అమలు చేయాల్సిన విద్యా శాఖ అధికారులు విషయం తెలిసినా మిన్నకుండి పోతున్నారు. అధికార పార్టీ వారే సరఫరాదారులు కావడంతో ఎవరిపై చర్యలు తీసుకుంటే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీదారులు సరుకులు కోత విధిస్తూ సొమ్ము వెనకేసుకోగా.. పోషకాహారం అందక విద్యార్థులు సతమతమవుతున్నారు. కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసే అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోషకాహారం పక్కదారి..
ప్రభుత్వ బడుల్లో కోడిగుడ్లు గల్లంతు
చూద్దామన్నా కనిపించని చిక్కీలు
ఏజెన్సీదారులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం!
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం కోడిగుడ్లు, చిక్కీలు క్రమం తప్పకుండా అందించాలి. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. సరిగా అందడం లేదని మాకు ఎక్కడా ఫిర్యాదు అందలేదు. ఎక్కడైనా అటువంటి సమస్య ఉన్నట్లు మా దృష్టికి వస్తే విచారణ జరిపి.. సరఫరా చేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. – కృష్ణప్ప, డీఈఓ
గుడ్లు ఇవ్వడం లేదు
మాకు వారం రోజులుగా కోడిగుడ్లు ఇవ్వడం లేదు. భోజనంతోనే సరిపెడుతున్నారు. రెండేళ్ల కిందటి వరకు రోజుకో రకం రుచికరమైన భోజనం, కోడిగుడ్లు, చిక్కీలు, రాగిమాల్ట్ అందాయి. ప్రస్తుతం ఏమైందో తెలియదు మాకు పెట్టే భోజనంలో తగ్గించేశారు. ఎప్పుడు ఏమి ఎగరగొడతారో తెలియడం లేదు.
– చందన, ఐదో తరగతి, పుట్టపర్తి
మెనూకు మంగళం
మెనూకు మంగళం


