60 చీనీ చెట్ల నరికివేత
తాడిమర్రి: చిల్లకొండయ్యపల్లిలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 60 చీనీచెట్లు నరికివేశారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన బాధితుల పట్ల సీఐ శ్యామరావు ఫోన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చిల్లకొండయ్యపల్లిలో కొంకా తిరుపాల్ తనకున్న సర్వే నంబర్ 24–5లోని పొలంలో ఐదేళ్ల క్రితం 300 చీనీ మొక్కలు సాగు చేశాడు. ఆదివారం ఉదయం నీరు పెట్టడానికి వెళ్లగా తోటలో 60 చీనీ చెట్లు నరికివేతకు గురవడం చూసి తిరుపాల్ భార్య కళావతి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధితులు అక్కడి నుంచి తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ వారు ఏఎస్‌ఐతో మాట్లాడుతూ ఇటీవల నెలకొన్న రస్తా వివాదం కారణంగానే గుర్తు తెలియని వ్యక్తులు తమ చీనీచెట్లను నరికేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఏఎస్‌ఐ తన సెల్‌ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్‌చేసి ముదిగుబ్బ సీఐ శ్యామరావ్‌కు వివరాలు తెలిపారు. చెట్లు ఎవరు పీకారో చెప్పలేనప్పుడు ‘ఏం.... కి వచ్చారు’ అంటూ మహిళ అని కూడా చూడకుండా సీఐ అనుచిత వ్యాఖ్యలు చేశారని రైతు దంపతులు ఆరోపించారు. అనంతరం వారు అక్కడి నుంచి ధర్మవరం వెళ్లి డీఎస్పీ హేమంత్‌కుమార్‌కు సీఐ ప్రవర్తన తీరుతో పాటు చీనీచెట్ల నరికివేత గురించి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని తాడిమర్రి పోలీసులను ఆదేశించారు.
చిల్లకొండయ్యపల్లిలో ఘటన
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీఐ అనుచిత వ్యాఖ్యలు
డీఎస్పీకి బాధిత రైతు దంపతుల ఫిర్యాదు


