విస్తరిస్తున్న విషసంస్కృతి
ధర్మవరం: పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రేపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ధర్మవరం నియోజకవర్గంలో చీనీ, మామిడి, బొప్పాయి, నేరేడు వంటి మొక్కలను, చెట్లను నరికి వేయడం లాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ కక్షలతో ప్రారంభమై అధికార పార్టీ అండతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులకే పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో ఒకరిని చూసి మరొకరు దారుణాలకు తెగబడుతున్నారు.
మూడుసార్లు చెట్ల నరికివేత..
రేగాటిపల్లి పంచాయతీ పరిధిలోని ముచ్చురామి గ్రామం రైతు రామ్మోహన్‌రెడ్డి 40 ఏళ్లుగా రేగాటిపల్లి సొసైటీలో సభ్యునిగా ఉండి 2.50ఎకరాల పొలాన్ని సాగు చేసుకునే వాడు. ఐదేళ్ల క్రితం ఈ పొలంలో 500 దాకా మామిడి, ఉసిరి, అల్లనేరేడు తదితర మొక్కలు నాటాడు. అయితే ఈ పొలానికి సంబంధించి ఆన్‌లైన్ రికార్డులను తన పేరిట ఎక్కించుకున్న అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు, మాజీ ఎంపీపీ గుర్రప్ప రైతును ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. చంద్రబాబు సర్కారు రాగానే పొలంలో 300 చెట్లు నరికించాడు. ఆ తర్వాత మూడు నెలల క్రితం 70 మొక్కలను మట్టుబెట్టించాడు. తాజాగా బుధవారం 150 మొక్కలను నరికించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. ఇవే ఘటనలు పునరావృతమయ్యాయి. ఏకంగా వారి దౌర్జన్యాలు పరాకాష్టకు చేరి ఆదివారం రోజున పొలం మొత్తం ట్రాక్టర్లతో దున్నేయడంతో రైతు పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. ఇలా రాజకీయ కక్షలతో ప్రారంభమైన చెట్లు నరికే సంస్కృతి మెల్లమెల్లగా నియోజకవర్గమంతా పాకుతోంది. తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో సైతం వరుస ఘటనలు చోటు చేసుకుంటుండటమే ఇందుకు నిదర్శనం. అయితే వీటిలో వ్యక్తిగత కక్షలు, భూవివాదాలే ఎక్కువగా ఘటనలకు కారణమవుతున్నాయి.
నియోజకవర్గంలో మచ్చుకు మరికొన్ని..
● తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రస్తా వివాదంలో సర్వే నంబర్ 24–5లో కొంకా తిరుపాల్, కొంకా శశి కళకు సంబంధించిన 60 చీనీ చెట్లను ప్రత్యర్థులు శనివారం రాత్రి నరికివేశారు. ఇటీవల జరుగుతున్న రస్తా వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
● తాడిమర్రి మండల కేంద్రంలో షెక్షావలి అనే రైతుకు చెందిన 15 చీనీ చెట్లను ప్రత్యర్థులు నరికి వేశారు. ఆస్తి వివాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
● ఏడాది క్రితం బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన వెంకటరాముడు అనంతపురం రూరల్ మండలం మన్నీల వద్ద సాగు చేస్తున్న 450 బొప్పాయి చెట్లను ఎవరో నరికివేశారు. అయితే ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు.
● 2024 జూలైలో బత్తలపల్లి మండలం యర్రాయపల్లి రైతు శివారెడ్డికి చెందిన 66 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఇందుకు సంబంధించిన కారణాలు కూడా తెలియరాలేదు.
కక్షలు, కార్పణ్యాలతో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం కోసం పచ్చని చెట్ల నరికివేత వంటివి ఇంత వరకు ఫ్యాక్షన్ ప్రభావిత తాడిపత్రి లాంటి ప్రాంతంలో చూశాం. అలాంటి విష సంస్కృతి ఇప్పుడు ధర్మవరంలో విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నపాటి కారణాలకే పచ్చని చెట్లను నరుక్కుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఇచ్చే సందేశం ఏమిటి? సాక్షాత్తు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది..? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గి నిందితులపై చర్యలు తీసుకోక పోవడమే ఇందుకు కారణమా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మంత్రి సత్యకుమార్ ఇలాకాలో...
పచ్చని చెట్లను నరికివేస్తున్న వైనం
రాజకీయ కక్షలతో మొదలై.. వ్యక్తిగత గొడవలతో తారస్థాయికి
ముచ్చురామిలో జనసేన నేత బరితెగింపు.. మూడుసార్లు చెట్ల నరికివేత
పోలీసుల ఉదాసీనత వల్లే ఘటనలు
నియోజకవర్గమంతా
పాకుతున్న దుష్ట సంప్రదాయం
విస్తరిస్తున్న విషసంస్కృతి


